కలం వెబ్ డెస్క్ : పంచాయతీ ఎన్నికల (Panchayat Elections)తో రాష్ట్రంలో ఒక్కోచోట జరుగుతున్న వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా నల్లగొండ జిల్లా లోని ఓ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల తీరు తీవ్ర దుమారం రేపుతోంది. తాము ఓట్లు వేసిన బ్యాలెట్ పేపర్లు (Ballot Papers) మురుగు కాలువలో దర్శనమివ్వడంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. దీంతో పలువురు నాయకుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ 12 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.
చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఇటీవల పంచాయతీ ఎన్నికలు(Panchayat Elections) జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల్లో నిలిచిన సర్పంచ్ అభ్యర్థి విజయం సాధించారు. బిక్షపతి అనే వ్యక్తి బీఆర్ఎస్ (BRS) మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో బిక్షపతికి పోలైన ఓట్లకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు (Ballot Papers) మురుగు కాలువల్లో లభ్యమవడం వివాదాస్పదంగా మారింది. ఎంతో రహస్యంగా భద్రపరచాల్సిన బ్యాలెట్ పేపర్లు రెండు రోజులకే మురుగు కాలువలో కనిపించడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల నిర్వహణపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చిరుమూర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, పలువురు బీఆర్ఎస్ నాయకులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగి ఉంటుందన్న అనుమానం వ్యక్తం చేశారు. ఆయా నాయకుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు చేపట్టారు. ఇప్పటికే రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేశారు. తాజాగా ఎంపీడీవో జయలక్ష్మి, స్టేజ్–2 అధికారి విజయ్ కుమార్ సహా మొత్తం 12 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టి దీనికి కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Read Also: మెస్సీ టూర్‌పై రంజిత్ బజాజ్ హాట్ కామెంట్స్ !
Follow Us On: Youtube


