కలం, వెబ్డెస్క్: రోజురోజుకూ పడిపోతున్న రూపాయి విలువ.. నిలకడలేని రియల్ ఎస్టేట్… జూదం లాంటి షేర్ మార్కెట్… బాండ్లు, ఫండ్స్ పక్కనపెడితే ప్రస్తుతం అత్యంత నమ్మకమైన పెట్టుబడి ఏది? అని అడిగితే.. ఆర్థిక నిపుణులు మొదలుకొని అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్నవాళ్లు సైతం చెప్పే సమాధానం ఒకటే.. అదే బంగారం. అదేంటి! బంగారం ఆభరణం మాత్రమే కదా అనుకుంటున్నారా? ఆ స్థాయిని ఎప్పుడో దాటింది పసిడి. దీనికి నిదర్శనం రోజురోజుకూ పెరుగుతున్న గోల్డ్ రేట్. బంగారం ధరలు ఎంతలా పెరిగాయంటే రెండేండ్లలో ఏకంగా రెట్టింపు (Gold prices double) స్థాయికి చేరాయి.
అప్పుడు 62వేలు.. ఇప్పుడు 1.34లక్షలు:
బంగారం ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి ఉదాహరణ గోల్డ్ మార్కెట్ గణాంకాలే. రెండేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున.. అంటే డిసెంబర్ 15, 2023న 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.62,321. నేడు.. అంటే డిసెంబర్ 15, 2025న 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,34,739. అంటే రెండేండ్లలో గోల్డ్ రేట్ డబుల్ దాటింది. ఇంకో విశేషమేమిటంటే పదేళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున బంగారం ధర రూ.12,834 మాత్రమే. ఆ తర్వాత 2021వరకు ధరలు పెరిగినా, పడుతూ లేస్తూ వచ్చాయి. 2022 నుంచి పెరగడమే తప్ప తగ్గలేదు. ఇక ఈ ఏడాది అయితే నెల నెలా రేట్ (Gold prices double) అనూహ్యంగా పెరిగిపోతూనే ఉన్నది. జనవరి 6న రూ.76,791గా ఉంటే, అదే నెల 31 నాటికి రూ. 82,152కు చేరుకుంది. అప్పటి నుంచి పరుగులు పెడుతున్న బంగారం ఈ నెల 12న గరిష్ఠంగా రూ.1,34,905గా నమోదైంది.
అలంకరణ నుంచి అమూల్యమైన పెట్టుబడిగా..
వేల ఏళ్లుగా భారత సంప్రదాయంలో బంగారానికి విశిష్టమైన స్థానం ఉంది. అలంకరణ వస్తువుగా చిన్నా, పెద్దా, ఆడా, మగా అందరూ బంగారాన్ని ఇష్టపడేవారు. కానీ, ప్రస్తుతం బంగారాన్ని చూసే కోణం మారింది. అలంకరణ వస్తువుగా కాకుండా అమూల్యమైన పెట్టుబడిగా చూడడం మొదలైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు మొదలుకొని ప్రతి ఒక్కరూ తమ సంపాదనను బంగారం కొనడానికి ఎక్కువగా వెచ్చిస్తున్నారు. బంగారం.. మంచి లాభం ఇచ్చే సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే బంగారం ధరలు (Gold prices double) శరవేగంగా పెరుగుతున్నాయి.
ఈ ఏడాది నెల వారీ బంగారం పెరుగుదల రేటు ఇలా..
నెల మినిమమ్(ధర. రూ) మాగ్జిమమ్(ధర.రూ)
జనవరి 76,791 82,152
ఫిబ్రవరి 81,500 86,576
మార్చి 84,212 89,028
ఏప్రిల్ 87,001 99,237
మే 91,104 97,506
జూన్ 95,217 1,00,314
జూలై 95,917 1,00,513
ఆగస్ట్ 98,734 1,03,652
సెప్టెంబరు 1,03,781 1,15,379
అక్టోబరు 1,15,870 1,31,953
నవంబరు 1,19,632 1,27,651
డిసెంబరు 1,26,559 1,34,905


