కలం, వెబ్‌డెస్క్: బౌలింగ్, బ్యాటింగ్‌లో సమష్టి ప్రదర్శనతో భారత్ మూడో టీ20లో అద్బుత విజయం సాధించింది. ధర్మశాల వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్ (IND Vs SA ) లో ఆతిథ్య జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పర్యాటక జట్టు ఆరంభం నుంచే వికెట్లు చేజార్చుకుంది. చివరికి సరిగ్గా ఇన్నింగ్స్ చివరి బంతికి 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మార్క్రమ్(61; 46 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు) టాప్ స్కోరర్. అర్షదీప్, హర్షిత్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ తలో రెండు వికెట్లు తీశారు. శివం దూబే, హార్థిక్ పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 118 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ ఆది నుంచే దూకుడుగా ఆడింది. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడిన అభిషేక్(35; 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) స్కోరు 60వద్ద తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. మార్క్రమ్ దాదాపు 24 మీటర్లు వెనక్కి పరుగెత్తి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆచితూచి ఆడిన గిల్(28; 28 బంతుల్లో 5 ఫోర్లు) 90 పరుగుల వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. పేలవ ఫామ్‌లో ఉన్న కెప్టెన్ సూర్యకుమార్(12; 11 బంతుల్లో 2 ఫోర్లు) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఈ సమయంలో తిలక్ వర్మ(25; 34 బంతుల్లో 3 ఫోర్లు)కు జత కలసిన శివం దూబే(10) వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో భారత్ మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే మ్యాచ్ (IND Vs SA)లో విజయం అందుకుంది. అర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. భారత్ సిరీస్‌లో 2–1 ఆధిక్యంలో నిలిచింది. తర్వాత టీ20 ఈ నెల17న లక్నో వేదికగా జరుగుతుంది.
Read Also: లోడ్‌తో దిగితే బ్యాటరీ ఫుల్.. చైనా ట్రక్కులకు కొత్త టెక్నాలజీ
Follow Us On: Instagram


