epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మోగ్లీ రివ్యూ.. రోషన్ హిట్ అందుకున్నాడా..?

కలం, వెబ్ డెస్క్: యాంకర్ సుమ కొడుకు రోషన్ హీరోగా వస్తున్న మూవీ మోగ్లీ (Mowgli Review). బబుల్ గమ్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఇప్పుడు ‘కలర్ ఫొటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ తో మోగ్లీ చేశాడు. నిన్న రాత్రి ప్రీమియర్స్ వేశారు. ట్రైలర్ తో మంచి అంచనాలు రేపిన ఈ మోగ్లీ ఒక రోజు వాయిదా పడి నేడు థియేటర్లలోకి వచ్చింది. సాక్షి మడోల్కార్ ఇందులో హీరోయిన్ గా చేయగా, వైవా హర్ష కీలక పాత్రలో నటించాడు. మరి సినిమా ఎలా ఉంది, రోషన్ హిట్ కొట్టాడా లేదా చూద్దాం.

కథ..

ఇదంతా ఏజెన్సీ ఏరియాలో జరిగే ఇంట్రెస్టింగ్ అండ్ సస్పెన్స్ గా సాగే లవ్ స్టోరీ. పార్వతీపురం ఏజెన్సీలో మోగ్లీ అలియాస్ మురళీకృష్ణ (రోషన్), అతని ఫ్రెండ్ ప్రభాస్ బంటి (వైవాహర్ష) సినిమాల షూటింగులకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేస్తుంటారు. మోగ్లీ (Mowgli) కి చిన్నప్పటి నుంచే ఎస్సై కావాలనేది కల. పార్వతీపురానికి ఓ సినిమా షూటింగ్ కోసం వచ్చిన సైడ్ డ్యాన్సర్ జాస్మిన్ (సాక్షి మడోల్కార్)తో మోగ్లీ తొలిచూపులోనే లవ్ లో పడుతాడు. కానీ జాస్మిన్ ను ఆ మూవీ ప్రొడ్యూసర్ అనుభవించాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆల్మోస్ట్ ఆ ప్రొడ్యూసర్ మాయలో జాస్మిన్ పడుతున్న టైమ్ లో మోగ్లీకి కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. ఇంతకీ ఏంటా విషయాలు, ఈ కథలో క్రిస్టోఫర్ నోలన్(బండి సరోజ్ కుమార్) ఎవరు, అతనికి హీరో, హీరోయిన్లకు ఉన్న సంబంధం ఏంటి, చివరకు మోగ్లీ, జాస్మిన్ కలిశారా లేదా అనేది థియేటర్ లోనే చూడాలి.

ఎలా ఉందంటే..?

ఇలాంటి రొటీన్ లవ్ స్టోరీలు చాలానే వచ్చాయి. ఒక మామూలు వ్యక్తి ఇంకో మామూలు అమ్మాయితో లవ్ లో పడటం, అదే అమ్మాయి మీద మరో బలవంతుడు, ధనవంతుడు అయిన వ్యక్తి మోజు పడటం లాంటివి మనం చాలా చూశాం. ఆ బలవంతుడిపై హీరో ఎలా గెలిచాడు అనే కోణంలోనే ఈ కథ కూడా సాగుతుంది. పాత కథలు ఎంచుకున్నా సరే.. వాటిని కొత్తగా తీయగలిగితే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. కానీ ఈ సినిమాలో అదే మిస్ అయింది. కలర్ ఫొటోతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ ఈ మూవీని అంచనాలకు తగ్గట్టు ప్రజెంట్ చేయలేకపోయాడు. కాకపోతే ఖర్మసిద్ధాంతం అనే దాన్ని తీసుకుని ఆ లైన్ తో మూవీని నడిపించాలి అనుకున్నారు. కానీ ఆ ఖర్మ సిద్ధాంతాన్ని కూడా సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు దర్శకుడు. ఫస్ట్ హాప్ కొంచెం సాగదీసినట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల లవ్ స్టోరీ సీన్లు ఆకట్టుకుంటాయి.

సెకండ్ హాఫ్‌ లో స్టోరీ పరుగులు పెడుతుంది. సెకండ్ హాఫ్‌ లో ఏదైనా ట్విస్టులు ఉంటే రిజల్ట్ వేరే విధంగా ఉండేదేమో. ఏ సినిమాకు అయినా సెకండ్ హాఫ్‌ బ్యాక్ బోన్ లాంటిది. కానీ మోగ్లీ సెకండ్ హాఫ్‌ లో రిపీటెడ్ సీన్లు రావడం, కథ అంటే అక్కడక్కడే తిరిగినట్టు అనిపించడంతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతారు. క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఖర్మ సిద్ధాంతంతో దీన్ని ముగించడం ఆకట్టుకుందనే చెప్పాలి. డైరెక్టర్ కథను ఏజెన్సీ ఏరియా నేపథ్యంలో రాసుకున్నాడు. కానీ దాన్ని కొత్తగా చూపించి ఉంటే బాగుండేదేమో.

ఎవరెలా చేశారంటే..?

రోషన్ కనకాల మొదటి సినిమా కంటే ఇందులో యాక్టింగ్ పరంగా చాలా బెటర్ అయ్యాడు. పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. లవ్ సీన్లలో, యాక్షన్ సీన్లలో రోషన్ పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. వైవా హర్ష, సాక్షి మడోల్కార్ పర్ఫార్మెన్స్ లు కూడా బాగున్నాయి. విలన్ గా చేసిన బండి సరోజ్ పాత్ర ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది.

టెక్నికల్ గా ఎలా ఉందంటే..?

డైరెక్టర్ సందీప్ రాజ్ కలర్ ఫొటోతో జాతీయ అవార్డు అందుకున్నాడు. ఆయన నుంచి సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కానీ కలర్ ఫొటో రేంజ్ లో దీన్ని మలచలేకపోయాడు. ఒక సింపతీ గెయిన్ చేసే క్రమంలో.. బలవంతుడు, బలహీనుల మధ్య పోటీ అనే కోణంలోనే సినిమాను తీశాడు. కానీ దాన్ని కొత్తగా తీయకపోవడం మైనస్ అయింది. కొన్ని సీన్లు మనకు గతంలోనే ఎన్నో సినిమాల్లో చూసిన ఫీలింగ్ కలుగుద్ది. కానీ ఖర్మ సిద్ధాంతాన్ని నమ్ముకోవడం కొంత ప్లస్ అయింది. కాలభైరవ ఇచ్చిన కొన్ని పాటలు బాగున్నాయి. బీజీఎం కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. మంచి లొకేషన్లు చూపించారు. ఎడిటింగ్ మీద ఇంకొంచెం దృష్టి పెట్టాల్సింది.

చివరగా..

మోగ్లీ.. ఒకసారి చూడగలిగే మూవీ.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>