కలం, నల్లగొండ బ్యూరో: గ్రామ పంచాయతీ తొలివిడత (Nalgonda Panchayat Polls) ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందనుకునే క్రమంలో నల్లగొండ జిల్లాలో కొత్త కలవరం మొదలైంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తంగా ఉండాల్సిన బ్యాలెట్ పేపర్లు డ్రైనేజీలో వెలుగుచూడడం వివాదానికి కారణమైంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి సంబంధించిన పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఓటరు బ్యాలెట్ పేపర్లు శుక్రవారం డ్రైనేజీలో దర్శనమిచ్చాయి. దీంతో వివాదం రాజుకున్నది. అయితే ఈ బ్యాలెట్ పేపర్లు అన్నీ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించినవి కావడంతో వివాదం ముదిరింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి గెలవడంతో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. చిన్నకాపర్తి సర్పంచ్ అభ్యర్థి విషయంలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. డ్రైనేజీలో బీఆర్ఎస్‌కు సంబంధించిన ఓటరు బ్యాలెట్ పేపర్లను బీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన కత్తెర గుర్తుపై ఓటు వేసిన స్లిప్ప్‌లు డ్రైనేజీలో గుర్తించారు. నల్లగొండ పంచాయతీ ఎన్నికల్లో ఈ అంశం వివాదానికి దారి తీసింది.
బీఆర్ఎస్ ఆందోళన
చిట్యాల మండలం చిన్నకాపర్తి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థికి సంబంధించిన ఓటరు స్లిప్ప్‌లు భారీగా డ్రైనేజీలో వెలుగుచూడడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రిగ్గింగ్ చేసి గెలిచారంటూ ఆ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. శుక్రవారం రాత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని కౌంటింగ్ సెంటర్ వద్ద పడేసిన ఓటర్ల స్లిప్ప్‌లను పరిశీలించారు.
స్టేజ్ 2 ఆర్ఓ సస్పెండ్…
గ్రామపంచాయతీ ఎన్నికలలో (Nalgonda Panchayat Polls) పోలైన బ్యాలెట్ పత్రాలు బయటికి వచ్చిన సంఘటనలో స్టేజ్- 2 ఆర్ఓను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. పోలైన బ్యాలెట్ పేపర్లను బయటకు తీసుకువచ్చిన మరో వ్యక్తి పై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ మొత్తం సంఘటనపై విచారణ నిర్వహించేందుకుగాను నల్లగొండ ఆర్డీవోను విచారణ అధికారిగా నియమించినట్లు తెలిపారు. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటిని ఆర్డీవో సమక్షంలో భద్రపరచాలని, దీనిని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశించారు.
Read Also: నోబెల్ గ్రహీత నర్గెస్ అరెస్ట్
Follow Us On: Sharechat


