కలం డెస్క్ : తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు (Prabhakar Rao) ఎట్టకేలకు జూబ్లీహిల్స్ పోలీసుల ముందు శుక్రవారం ఉదయం లొంగిపోయారు. సుప్రీంకోర్టు రిలీఫ్ ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు నిర్దిష్ట టైమ్ ఫిక్స్ చేసి ఆదేశాలు ఇవ్వడంతో లొంగిపోక తప్పలేదు. వారం రోజుల పాటు ఆయనను కస్టడీలోకి తీసుకోడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారంలో ఆయన ధ్వంసం చేసిన హార్డు డిస్కుల వ్యవహారం, ఐ-క్లౌడ్ (i-Cloud) అకౌంట్ పాస్‌వర్డ్ రికవరీ, అందులోని సమాచారాన్ని బైటకు తీయడం, ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది.. ఇలాంటి వివరాలన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సేకరించనున్నది. కస్టడీలో విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి.
కీలక మలుపు తీసుకునే చాన్స్ :
ప్రభాకర్‌రావు (Prabhakar Rao) వెల్లడించే సమాచారం ఈ కేసు దర్యాప్తులో కీలక మలుపు తీసుకోనున్నది. రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే హార్డ్ డిస్క్ లను తొలగించినట్లు ఆయన సుప్రీంకోర్టులో వెల్లడించినందున అందుకు తగిన లిఖితపూర్వక ఆదేశాల వివరాలను, కాపీలను ఆయన నుంచి పోలీసులు రాబట్టనున్నారు. నాలుగు ఐ-క్లౌడ్ అకౌంట్లలో మూడు మాత్రమే పాస్‌వర్డ్ రికవరీ అయ్యాయి. మరొకటి అమెరికా నెంబర్‌తో లింక్ అయినందున దాన్ని కూడా ఓపెన్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో వెల్లడైన అంశాలు ఎలా ఉన్నా ఇప్పుడు వారం రోజుల్లో వెలికి తీయనున్న వివరాలు ఈ కేసుకు కీలకం కానున్నాయి. గతంలో జరిగిన విచారణలకు ఆయన సహకరించలేదని, ఉద్దేశపూర్వకంగానే సమాచారాన్ని దాచిపెట్టారని పోలీసులు సుప్రీంకోర్టులోనే స్పష్టం చేశారు.
పేర్లు వెల్లడయ్యే అవకాశం :
ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది తాజా కస్టడీ విచారణలో కీలకంగా మారనున్నది. ఎస్ఐబీ రెగ్యులర్ ఫంక్షనింగ్ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరిగే వ్యవహారం కావడంతో అప్పటి సీఎంగా వ్యవహరించిన కేసీఆర్ పేరు వెల్లడవుతుందేమోననే చర్చలూ జరుగుతున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకల్లో కేసీఆర్ పేరు వెల్లడైంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్‌లో సైతం ఆయన పేరు వెలుగులోకి వస్తుందా?.. కేసీఆర్‌తో పాటు ఇంకెవరి పేర్లను ఆయన వెల్లడిస్తారు?.. లిఖితపూర్వక ఆదేశాల్లో ఏ ఉన్నతాధికారుల పేర్లు ఉంటాయి?.. ఇలాంటివన్నీ ఆసక్తికరంగా మారాయి.
Read Also: ఈసారి హాజరుకాకుంటే వారెంట్ ఇస్తాం
Follow Us On: X(Twitter)


