epaper
Friday, January 16, 2026
spot_img
epaper

పాడైన గోధుమలు పంపారు.. నాణ్యమైన బియ్యం ఇస్తున్నాం..

కలం, వెబ్​డెస్క్​: Rice Exports To USA | ‘అమెరికాలోకి ఆసియా దేశాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతున్నాయి. భారత్, చైనా, వియత్నాం నుంచి బియ్యం భారీగా డంప్​ అవుతోంది. ఇక్కడి రాయితీలు ఉపయోగించుకొని స్థానిక బియ్యం ఉత్పత్తులకు డిమాండ్​ లేకుండా చేస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు అమెరికాకు దిగుమతి అవుతున్న బియ్యంపై సుంకాలు విధిస్తాం.’ – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ బెదిరింపు ఇది. ఒకవేళ ట్రంప్​ బెదిరింపులు ఆచరణలోకి వస్తే దాని ప్రభావం ఎక్కువగా పడేది భారత్​పైనే. ఎందుకంటే ప్రస్తుతం అమెరికా దిగుమతి చేసుకుంటున్న బియ్యంలో ఎక్కువ భాగం భారత్​ నుంచి వస్తున్నదే. ఈ క్రమంలో భారత రైతుల్లో.. ముఖ్యంగా వరి పండించే అన్నదాతల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో భారత బియ్యం ఎగుమతుల వెనక ఒక ఆసక్తికర, స్ఫూర్తిదాయక ప్రయాణం ఒకటుంది. అదేంటంటే..

ఆహార సంక్షోభం..:

స్వాతంత్య్రం అనంతరం భారత్​ ఎదుర్కొన్న సమస్యల్లో ముఖ్యమైనది ఆహార సంక్షోభం. కోట్లాది జనం.. పేదరికం.. బ్రిటిష్​ వలస పాలన వల్ల తగ్గిన వ్యవసాయం.. పాడైన భూములు.. అప్పుల్లో రైతులు..వీటి మధ్య పాకిస్థాన్​, చైనాతో యుద్దాలు.. వెరసి దేశమంతా ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా ఉండేది. ఫలితంగా ఆకలి చావులు కనిపించేవి. 1965లో సరైన వర్షాలు పడక దేశమంతా కరువు వచ్చింది. ఆ ఏడాది దిగుబడులు 20శాతం మేర తగ్గాయి. ఫలితంగా అందరికీ సక్రమంగా ఆహారం అందని పరిస్థితి. బిహార్​లో 2,500 మంది ఆకలి చావులకు గురయ్యారు. అయితే, అప్పటికి పదేళ్ల పైనుంచి అంటే 1950 నుంచే భారత్​కు అమెరికా ఓడల ద్వారా గోధుమలు, గోధుమ పిండి పంపేది. దీన్నే అప్పట్లో ‘షిప్​ టు మౌత్​ ’ అని పిలిచేవాళ్లు. కానీ, ఇలా వచ్చే సాయం భారత అవసరాలకు సరిపోయేది కాదు.

అవమానించి… ఆపేసి..:

అమెరికా పీఎల్​ఏ–480 పథకం కింద వివిధ దేశాలకు ఆహార ఉత్పత్తులు.. ముఖ్యంగా గోధుమలు, గోధుమ పిండి పంపేది. దీనికి ‘ఫుడ్​ ఫర్​ పీస్​’ అనే పేరు పెట్టింది. ఈ పథకంపై కింద ఏటా కనీసం 10 మిలియన్​ టన్నుల గోధుమలు, గోధుమ పిండి భారత్​కు వచ్చేవి. కానీ, అమెరికా ఈ సాయం మానవతా ధోరణితో చేయలేదు. తమ అవసరాలకు అనుగుణంగా పంపేది. అంతేకాదు, పాడైపోయిన, పశువులకు వేసే గోధుమలు, గోధుమ పిండి పంపేది. వీటితో తయారుచేసే చపాతీలు, రోటీలు నల్లగా, అస్సలు తినలేనివిగా ఉండేవి. ఫలితంగా ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో హఠాత్తుగా ఒక ఏడాది సాయం ఆపేసింది. కారణం.. వియత్నాం మీద అమెరికాను భారత్​ విమర్శించడం. దీంతో అగ్రరాజ్యం సాయం ఆపేసింది. వెంటనే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమెరికా వెళ్లి, అక్కడి పాలకులను ప్రాథేయపడాల్సి వచ్చింది. అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడబోమని హామీ ఇవ్వాల్సి వచ్చింది.

హరిత విప్లవంతో..:

సాయం మాటున అమెరికా చేసిన అవమానం భారత రాజకీయ నాయకులను, మేధావులను ఆలోచింపచేసింది. ఆహారంపై ఇతర దేశాల మీద ఆధారపడకుండా, స్వావలంబన సాధించాలనే సంకల్పానికి బీజం వేసింది. అదే సమయంలో నార్మన్​ బోర్లాగ్​ ఆధ్వర్యంలో మెక్సికోలో హరిత విప్లవం తీసుకొచ్చిన మార్పు ఆకర్షించింది. వెంటనే ఎంఎస్​ స్వామినాథన్ (MS Swaminathan) నేతృత్వంలో భారత్ హరిత విప్లవానికి శ్రీకారం చుట్టింది. అధిక దిగుబడి ఇచ్చే విత్తనాల తయారీ, మెక్సికన్​ గోధుమ రకాలు, ఎరువులు, నీటి పారుదల, ట్రాక్టర్లు, థ్రెషర్లు, ఎంఎస్​పీ వ్యవస్థ వంటి సంస్కరణలు పరుగులు పెట్టాయి. ఫలితంగా 1974 నాటికి ఆహార ఉత్పత్తుల్లో.. ముఖ్యంగా గోధుమ, వరి విషయంలో భారత్​ పూర్తి స్వావలంబన సాధించింది.

1990 దశకం వచ్చేసరికి.. అమెరికాకు మన ఆహారధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ప్రస్తుతం భారత్​ 120 దేశాలకు గోధుమ, బియ్యం ఎగుమతి చేస్తోంది. దేశవ్యాప్తంగా 80కోట్ల మందికి ఉచితంగా గోధుమలు, బియ్యం వంటివి అందిస్తోంది. 2022 నాటికి మనదేశం వివిధ దేశాలకు 22.2 మిలియన్​ టన్నుల బియ్యం ఎగుమతి చేసింది. బియ్యం ఎగుమతిలో అగ్రస్థానానికి చేరింది. ఆహార కొరతతో ఇబ్బంది పడుతున్న ఆఫ్రికా దేశాలకు మానవతా సాయం కింద బియ్యం, గోధుమలు అందిస్తోంది. మరికొన్ని దేశాలకు సైతం విపత్తుల్లో అండగా ఉంటోంది.

ఆరు దశాబ్దాల్లో ఊహించని మార్పు..:

హరిత విప్లవం కారణంగా ఆరు దశాబ్దాల్లో ఎంతో మార్పు వచ్చింది. అమెరికాకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేసే స్థాయికి భారత్​ చేరింది. దీనికి కారణాలు అనేకం. 1960–70 దశకంలో అమెరికాలో బియ్యం ఎక్కువగా వినియోగంలో ఉండేది కాదు. అప్పట్లో ఒక్కో అమెరికన్​ వార్షిక బియ్యం వినియోగం 5.2కిలోలు ఉండేది. అయితే, 2023–24 నాటికి అది 11.8 కిలోలకు పెరిగింది. అలాగే ఆసియా, హిస్పానిక్​ జనాభా పెరగడం, గ్లూటెన్​ ఫ్రీ ఆహారంపై వచ్చిన ట్రెండ్, బియ్యంలో బాస్మతి తదితర కొత్త రకాలు రావడం వంటివి వినియోగాన్ని పెంచాయి.

అమెరికాలోనూ బియ్యం ఉత్పత్తి 9మిలియన్​ టన్నులకు పెరిగినా అది సరిపోవడం లేదు. పైగా ప్రత్యేక రకాల కోసం దిగుమతులపై ఆధారపడాల్సిందే. ఫలితంగానే 2024 నాటికి అమెరికా బియ్యం 1.61 బిలియన్​ డాలర్ల విలువైన బియ్యం దిగుమతి చేసుకుంటుండగా, ఇందులో దాదాపు 380 మిలియన్​ డాలర్ల విలువైన బియ్యం.. అంటే దాదాపు 1/4 వంతు భారత్​ నుంచే వెళుతోంది. వ్యవసాయ, ప్రాసెస్డ్​ ఫుడ్​ ప్రొడక్ట్స్​ డెవలప్​మెంట్​ అథారిటీ లెక్కల ప్రకారం 2024–25లో భారత్​ నుంచి అమెరికాకు 1.93 మిలియన్​ డాలర్ల వ్యవసాయ, ఆహార ఎగుమతులు (Rice Exports To USA) జరిగాయి. ఇందులో బాస్మతి బియ్యందే అధిక వాటా.

Read Also: తాజ్ బంజారాను కొనేసిన అరబిందో

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>