ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే ఉద్యోగాలతో జీవితంలో ఏం సాధించలేం. మహా అయితే ప్రతి నెల ఒకటో తేదీన జీతం అందుకుంటాం అంతే’ ఇది చాలా మంది సక్సెస్‌ఫుల్ వ్యక్తులు చెప్పే మాట. జీవితంలో ఎదగాలన్నా, కలలను సాకారం చేసుకోవాలన్న 95 జాబ్‌తో జరగదని, రిస్క్ తీసుకుని అడుగు ముందుకు వేయాలని అంటారు. కానీ ఆ మాటలన్నింటినీ హైదరాబాద్‌కు చెందిన ఓ టెకీ(Hyderabad Techie Niharika) తప్పని నిరూపించింది. 9-5 ఉద్యోగాలతో కూడా మన కలలను నెరవేర్చుకోవచ్చని నిరూపించింది. 9-5 ఐటీ జాబ్ ఆమె కలను నెరవేర్చింది. ఆమె పేరే నిహారిక నాయక్. హైదరాబాద్‌కు చెందిన ఈ టెకీ.. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఐటీ ఉద్యోగం చేస్తూ తన డ్రీమ్ కార్ ‘మినీ కూపర్’ను కొనుగోలు చేసింది. ఈ కారు ధర రూ.65 లక్షలు, దీనిని ఆమె ఈఎంఐలో తీసుకుంది. అందుకుగాను ఆమె నెలకు రూ.85వేల వరకు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. తాజాగా ఆమె తన ఉద్యోగం, జీతం, కల గురించి వివరించింది.
ప్రస్తుతం నిహారికా, హైదరాబాద్‌లోని ఒక మధ్యస్థాయి టెక్ కన్సల్టెన్సీలో హెడ్ ఆఫ్ క్వాలిటీ అష్యూరెన్స్‌గా పనిచేస్తోంది. ఆమె తన భర్త, కుమారునితో కలిసి అక్కడే నివసిస్తోంది. తన చిన్ననాటి జీవితం “సాధారణ మధ్య తరగతి” కుటుంబంలో జబల్పూర్, మధ్యప్రదేశ్‌లో గడిచిందని నిహారిక(Hyderabad Techie Niharika) చెప్పింది. 2008లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్‌ను పూర్తి చేసిన తర్వాత, అనేక కంపెనీల్లో పనిచేసింది. “నేను గ్రాడ్యుయేట్ అయినప్పుడు, IT రంగంపై కొంచెం అనుమానం ఉండేది. ఆ సమయంలో ఈ రంగం స్థిరంగా లేదు. అయినా నేను ఇదే రంగాన్ని ఎంచుకున్నాను, ఇప్పటికి 16 ఏళ్లు అవుతోంది” అని ఆమె చెప్పింది.
కంపెనీలు జీతం కోసం మర్చలేదు
IT రంగాన్ని ఎంచుకోవడం, నిహారికాకు సరైన నిర్ణయమైంది. గత 16 ఏళ్లలో ఆమె అనేక కంపెనీలు మార్చుతూ కెరీర్‌ను అభివృద్ధి చేసుకుంది. “నేను జీతం కోసం మాత్రమే కాకుండా ఎదగడానికి, నేర్చుకోవడానికి ఉద్యోగాలు మార్చాను. నేను ఏ పని చేసినా టాప్‌లో ఉండాలనుకునే వ్యక్తిని,” అని ఆమె చెప్పింది. ఆమె ప్రస్తుతం పనిచేస్తున్న కంపెనీలో ఆరు సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తోంది. ఆమె వార్షిక జీతం రూ.50 లక్షలకు పైగా ఉందని వెల్లడించింది. ఆమె భర్త కూడా IT రంగంలో పనిచేస్తూ అదే స్థాయిలో జీతం పొందుతున్నాడని తెలిపింది.
మినీ కూపర్(Mini Cooper) ఆమె కల
హైదరాబాద్‌లో మినీ కూపర్ S ఆన్ రోడ్ ధర రూ.65 లక్షలు అని, 2025 జనవరిలో లోన్‌పై కొనుగోలు చేశానని ఆమె చెప్పింది. వచ్చే ఐదు సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.85,000 నుంచి రూ.90,000 EMI చెల్లించాల్సి ఉంటుంది. “ప్రపంచానికి ఇది లగ్జరీగా కనిపించినా, అది నా 16 ఏళ్ల ప్రయాణానికి చిహ్నం” అని నిహారికా వివరించింది. “నేను ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ఉద్యోగం కొనసాగిస్తున్నాను. నాకు కొడుకు ఉన్నాడు, రెండు పిల్లులు కూడా ఉన్నాయి. ఏం జరిగినా ఉద్యోగం వదలకూడదనే నిర్ణయం తీసుకున్నాను, ఎందుకంటే ఉద్యోగం నాకు ఆర్థిక భద్రత, స్వతంత్రత ఇస్తుంది” అని నిహారికా అంటోంది.
కారు చూపించుకోవడానికి కాదు
ఈ మిని కూపర్ ఎస్‌ను నిహారికా లగ్జరీగా చూపించుకోవడానికి కొనుగోలు చేయలేదు. ప్రతిరోజూ తన కొడుకును స్కూల్‌కు తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నట్లు ఆమె చెప్పింది. “నా రోజు ఉదయం 6:30కు మొదలవుతుంది. నా కొడుకి బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి, లంచ్‌బాక్స్ ప్యాక్ చేసి స్కూల్‌కు తీసుకెళ్తాను. ఆ తర్వాత జిమ్‌కు వెళ్తాను. హైబ్రిడ్ వర్క్ మోడల్ కావడంతో నేను వారంలో మూడు రోజులు ఇంటి నుంచే పని చేస్తా” అని నిహారిక చెప్తోంది.
సోషల్ మీడియా ప్రయాణం
నిహారికా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ @life_beyondmama ను నాలుగు నెలల క్రితమే ప్రారంభించింది. ఆమె పంచుకున్న కార్ డెలివరీ వీడియోకు ప్రస్తుతం వందలాది వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. “9 నుండి 5 ఉద్యోగం… చివరికి మినీ కూపర్‌తో ముగిస్తే అంత చెడ్డది కాదు” అని ఆమె తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా ఇంకా ఆదాయం రావడం లేదని చెప్పిన ఆమె, ఇది ఇతర మహిళలకు ప్రేరణగా ఉండాలని కోరుకుంటోంది. “39 ఏళ్ల వయసులో అందంగా కనిపించడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉండటం ముఖ్యం. మహిళలు కుటుంబం కోసం తమ కెరీర్, ఆరోగ్యం, వ్యక్తిగత సంరక్షణను మర్చిపోతారు. వాటిపై కూడా సమయం పెట్టాలి” అని నిహారిక తన ఆలోచనను చెప్పింది.
Read Also: స్మార్ట్ ఫోన్లలో ‘సంచార్ సాథీ’ యాప్… ఆందోళనలో యూజర్స్
Follow Us On: Pinterest


