epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

గ్లోబల్ ఇన్వెస్టర్లకు తెలంగాణ ‘ఫ్యూచర్’

కలం డెస్క్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుతున్న ప్రజా విజయోత్సవాల్లో భాగంగా రెండు రోజుల గ్లోబల్ సమ్మిట్‌కు (Global Summit) ఫ్యూచర్ సిటీ (Future City) ముస్తాబైంది. మొత్తం హైదరాబాద్ నగరానికే పండగ వచ్చిన తరహాలో సచివాలయం మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కీలకమైన కూడళ్ళు రంగురంగుల లైట్లతో ఝిగేల్‌మంటున్నాయి. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లోనూ భారీ స్థాయి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. విమానాశ్రయం మొదలు సమ్మిట్ వేదిక వరకు పలుచోట్ల డిజిటల్ స్క్రీన్లలో తెలంగాణ భవిష్యత్తును తెలియజేసే వీడియోలు ప్రసారమవుతున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులతో పాటు వివిధ కంపెనీలు, దేశంలోని పారిశ్రామికవేత్తలు.. ఇలా మొత్తం రెండు వేల మంది డెలిగేట్స్ హాజరవుతున్నారు.

ఇన్వెస్ట్ మెంట్స్ కు డెస్టినేషన్‌గా తెలంగాణ :

వాతావరణంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలతో విదేశీ పెట్టుబడిదార్లకు ఇన్వెస్ట్ మెంట్ డెస్టినేషన్‌గా తెలంగాణ ఉంటుందనే మెసేజ్‌ను గతంలో దావోస్ ద్వారా స్పష్టం చేసిన ప్రభుత్వం ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్(Global Summit) ద్వారా మరోసారి ఆ మెసేజ్ ఇవ్వనున్నది. అనేక కంపెనీలతో వ్యాపార, అవగాహనా ఒప్పందాలు జరగనున్నాయి. దాదాపు లక్ష కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర సర్కార్ అంచనా. ప్రస్తుత తెలంగాణ ఎకానమీ గురించి వివరించడంతో పాటు రాబోయే పదేండ్లలో ఏ స్థాయికి చేరుకుంటుంటుందో, 2047 సంవత్సరానికి ఎక్కడకు చేరుకుంటుందో తెలంగాణ రైజింగ్ విజన్(Telangana Rising Vision) డాక్యుమెంట్ ద్వారా వివరించనున్నది. రానున్న 22 ఏండ్లలో రాష్ట్ర ఎకానమీ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందనే భరోసాతో పాటు అది సాకారమయ్యేందుకు ప్రభుత్వం తీసుకురాబోయే పాలసీలు, అవకాశాలు తదితరాలను సమ్మిట్ ద్వారా వెల్లడించనున్నది.

డ్రోన్‌లు.. సీసీటీవీలు.. భారీ భద్రత :

రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో నిర్మించనున్న భారత్ ఫ్యూచర్ సిటీ దగ్గరే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నది. దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్‌లో దాదాపు 500 ఎకరాల్లో హాళ్ళు, వేదిక, పైలాన్, లాన్,.. ఇలా అనేకం సిద్ధమయ్యాయి. దేశ, విదేశాల నుంచి వచ్చే డెలిగేట్స్ కోసం కార్ పార్కింగ్, లాంజిలు, భారీ డైనింగ్ హాల్, ఎక్కడికక్కడ డిజిటల్ స్క్రీన్స్, వాటిపై నిత్యం డిస్‌ప్లే అయ్యే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు.. ఇవన్నీ స్వయంగా సీఎం రేవంత్ పర్యవేక్షించారు. వీఐపీలు వస్తున్నందున భద్రత విషయంలోనూ పకడ్బందీ ఏర్పాట్లు జరిగాయి. ఒకవైపు నిత్యం గాల్లో ఎగిరే డ్రోన్లు, మరోవైపు సీసీటీవీ కెమెరాల నిఘా ఏర్పాటైంది. ఒకేసారి రెండు వేల మంది కూర్చునేలా ఏర్పాటైన భారీ వేదిక ఈ గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణ.

ముగింపుగా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ :

గ్లోబల్ సమ్మిట్ లాంఛనంగా సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్ చేతుల మీదుగా ఇనాగరేషన్ జరిగిన తర్వాత డిప్యూటీ సీఎం సహా పలువురు ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సమ్మిట్ నిర్వహణకు సంబంధించిన అంశాలను సీఎం రేవంత్‌రెడ్డి వివరిస్తారు. ఆ తర్వాత వివిధ అంతర్జాతీయ కంపెనీలు, ఆర్థికవేత్తలు, రాయబారులు, దౌత్యవేత్తలు.. ఇలా వివిధ రంగాలకు చెందినవారితో సీఎం సహా మంత్రులు, అధికారుల బృందాలు వేర్వేరుగా సమావేశమవుతారు. విజన్ డాక్యుమెంట్ వెలుగులో ఒక్కో రంగం రానున్న 22 ఏండ్లలో ఎలా అభివృద్ధి చెందుతుందో వివరించేలా ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి. తెలంగాణ అనుసరించబోయే ఆచరణ, రూపొందించబోయే పాలసీలను ఆఫీసర్లు వివరిస్తారు. ఆయా రంగాల ఇన్వెస్టర్లు ఇక్కడ పరిశ్రమలను స్థాపించాలని, పెట్టుబడులు పెట్టాలని ప్రభుత్వం తరఫున కోరనున్నారు.

Read Also: బిగ్ బ్యూటిఫుల్ బిల్: మరో షాకిచ్చిన ట్రంప్

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>