Mobile Popup Ad
Mobile Popup Ad

సూర్యాపేటలో నల్ల బ్యాడ్జీలతో ఆశా వర్కర్ల నిరసన..

కలం, నల్లగొండ బ్యూరో : తమకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్లు సమరశంఖం పూరించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరుతూ.. జిల్లా వ్యాప్తంగా వందలాదిగా తరలివచ్చిన ఆశా వర్కర్లు (ASHA Workers) నల్ల బ్యాడ్జీలు ధరించి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ఆశా వర్కర్లు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ చేపట్టి ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో నగరాన్ని మార్మోగించారు. అనంతరం ప్రధాన కూడలి వద్ద భారీ మానవహారం నిర్వహించి ట్రాఫిక్‌ను దిగ్బంధించారు.

ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం నెలకు రూ.18,000 వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా తమ సమస్యల పరిష్కారంపై ఎలాంటి స్పష్టత లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో అహర్నిశలు శ్రమిస్తున్న తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, తగిన సౌకర్యాలు కల్పించాలని కోరారు. వెంటనే జీవో జారీ చేసి తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే విధులను బహిష్కరించడానికైనా వెనకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆశా వర్కర్ల యూనియన్ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>