epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మావోయిస్టుల కోటలో మామిడి సిరులు

కలం, వెబ్​ డెస్క్​: దశాబ్దాలుగా బాంబులు, తుపాకీ మోతలతో దద్దరిల్లిన ప్రాంతమది. భద్రతా దళాలు, మావోల పోరులో నెత్తురోడిన నేల అది. రాజ్యాధికారం గొడవల్లో అమాయకులెందరో బలైన కర్మభూమి అది. అభివృద్ధి సంగతి అటుంచితే కనీస సౌకర్యాలకూ నోచని ఆదివాసీ తెగల ఆవాసమది. అలాంటి చోట సుస్థిర ప్రగతికి బాటలు వేస్తోంది ఓ ప్రాజెక్ట్​. స్థానిక జీవనశైలికి, అడవుల పచ్చదనానికి భంగం కలిగించకుండానే వారి జీవితాల్లో వెలుగులు తీసుకొస్తోంది. ఆ ప్రాంతం సుక్మా.. ఆ ప్రాజెక్ట్​ ఆమ్​ బగీచా(Aam Bagicha Project). ఆమ్​ అంటే మామిడి, బాగ్​ అంటే తోట. మావోల కోటలో ఆమ్​ బగీచా మామిడి సిరులు పండిస్తోంది.

కలెక్టర్​ చొరవతో..:

​చత్తీస్​ గఢ్(Chhattisgarh) లోని బస్తర్​ రీజియన్​ లో ఉన్న సుక్మా జిల్లా అత్యంత వెనకబడిన ప్రాంతాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న ఈ జిల్లా నక్సల్స్​ ప్రభావిత ప్రాంతం. ఇక్కడ అభివృద్ది అంతంమాత్రమే. అలాంటి జిల్లాలోని గ్రామాలే గోర్గుంద, కరిగుండం, తాడిమెట్ల, ముక్రంనాలా. ధ్వంసమైన స్కూళ్లు, ప్రభుత్వ భవనాలు, రోడ్లు ఇక్కడ సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఆధునిక ప్రపంచానికి, అభివృద్ధికి దూరంగా ఉన్న ఈ గ్రామాల్లో మార్పు తీసుకురావాలనుకున్నాడు సుక్మా కలెక్టర్​ హారిస్​. దీనికోసం ఏంచేయాలో ఆలోచించాడు. అప్పటికే జార్ఖండ్​ జిల్లాలో కొన్ని చోట్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సాగవుతున్న మామిడి తోటల పెంపకం ఆయన్ని ఆకర్షించింది. దానిపై మరింత లోతుగా అధ్యయనం చేసి ‘ఆమ్​ బగీచా’ ప్రాజెక్ట్(Aam Bagicha Project)​ పై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాడు. దీనికి ఆమోదం లభించిన వెంటనే ఆ నాలుగు గ్రామాల ప్రజలను కలసి ప్రాజెక్ట్​ గురించి వివరించాడు.

సామూహిక సాగు..:

గ్రామస్థుల సమ్మతితో సామూహిక సాగు ప్రారంభమైంది. మొదట పది ఎకరాల్లో సాగు మొదలుపెట్టారు. వాటిలో మామిడి మొక్కలు నాటారు. అంతర పంటగా గోంగూర, గోరుచిక్కుడు, బెండ వంటివి వేశారు. మామిడి మొక్కలు పెరుగుతుండగానే అంతర పంటల వల్ల ఆదాయం రావడం మొదలైంది. ఈలోపు మిగిలిన రైతుల్లో కొందరు మామిడితోపాటు నిమ్మ, కొబ్బరి కూడా సాగుచేయడం మొదలుపెట్టారు. కేవలం తోటల సాగుకు మాత్రమే కాదు బోర్లు వేయడం, డ్రిప్​ ఇరిగేషన్​, కాలువల తవ్వకం, దిగుబడికి మార్కెటింగ్​, రాయితీపై వ్యవసాయ పరికరాలు వంటివి కూడా ప్రభుత్వమే ఇస్తోంది. దీంతో స్థిర ఆదాయానికి బాటలు పడ్డాయి. దీని ప్రభావం ఇప్పుడా పల్లెలపై స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త రోడ్లు, స్కూళ్లు, ఆస్పత్రులు వస్తున్నాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాను సమీపంలోని కొంటా ప్రాంతంలోనూ విస్తరించేందుకు చత్తీస్​ గఢ్​ ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

స్థిర ఆదాయం.. సుస్థిరాభివృద్ది: ఒకప్పుడు వర్షాధారంగా సాగు చేసే వరికి తోడు చింతపండు, అడవుల్లో దొరికే మరికొన్ని రకాల పండ్ల ఉత్పత్తులు మాత్రమే ఇక్కడి గిరిజనులకు జీవనాధారం. నక్సల్స్​ ప్రభావం వల్ల అటవీ ఉత్పత్తుల సేకరణకు ఆటంకం కలగడం, వరి దిగుబడి అంతంత మాత్రమే కావడంతో జీవనం ఇబ్బందిగా మారేది. ఆ పరిస్థితి ఆమ్​ బగీచాతో తీరిపోయింది. ఈ ప్రాజెక్ట్​ గిరిజన ప్రాంతాల్లో ఆర్థిక సాధికారతకు తోడ్పడుతోంది. దీర్ఘకాలం ఆదాయం ఇచ్చే మామిడి లాంటి పంటల సాగు పేదరికాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, డ్రిప్​ ఇరిగేషన్​, మిక్స్​ డ్​ పంటల సాగు ద్వారా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్ల తోటల పెంపకం భూసార పరిరక్షణకు, నీటి సంరక్షణకు తోడ్పడుతోంది. ఈ విధానంలో అరుదుగా పంట నష్టం ఉంటుంది. స్థిరమైన, నమ్మకమైన ఆదాయం వల్ల ఆర్థికాభివృద్ధిలో సామాజిక స్థిరత్వం లభిస్తుంది. ఫలితంగా తీవ్రవాదం వంటి అతివాద భావజాలం వైపు గిరిజనులు వెళ్లరు. ఆమ్​ బగీచాలో మరో ముఖ్యమైన అంశం.. పర్యావరణ పరిరక్షణ. మామిడి, నిమ్మ, కొబ్బరి వంటి తోటల వల్ల పచ్చదనం మరింత పెరుగుతుంది. ఇక్కడి పర్యావరణానికి, ముఖ్యంగా సమీపంలోని అడవులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. తమ ప్రాంత వైరుద్యానికి, విశిష్టతకు ఎలాంటి నష్టం లేకుండా తమ భవిష్యత్తు తరాలకు గిరిజనులు అందించగలరు.

Read Also: ఫ్లైట్ రేట్ ఫిక్స్ చేసిన డీజీసీఏ

Follow Us On : Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>