ప్రభుత్వ పథకాలకు అమరవీరుల పేర్లను పెట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) డిమాండ్ చేశారు. స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలు వెలకట్టలేనివని, వారి కుటుంబాలను ఆదుకోవడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆమె అన్నారు. బుధవారం ఎల్బీ నగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అమరవీరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమానికి ఎల్బీ నగర్ పురిటిగడ్డ వంటిదన్నారు. స్వరాష్ట్రం కోరుతూ నవంబర్ 29న కేసీఆర్ దీక్ష చేశారని, అదే రోజు శ్రీకాంతాచారి ఆత్మబలిదానానికి పాల్పడ్డారని, అనంతరం చికిత్స పొందుతూ డిసెంబర్ 3న ప్రాణాలు కోల్పోయారని కవిత గుర్తుచేశారు.
ఒక పక్క కేసీఆర్ దీక్ష, మరోపక్క మన బిడ్డల త్యాగాలతో ఊరూరా దీక్షా శిబిరాలు వెలిశాయని, బోనాలు, బతుకమ్మ పండుగల్లోనూ నిరసనలు వెల్లువెత్తాయని చెప్పారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యమం ఉద్ధృతం చేశారన్నారు. ‘స్వరాష్ట్ర సాధనలో శ్రీకాంతాచారితోపాటు 12వందల మంది అశువులు బాశారు.వారి త్యాగాల పునాదుల మీద రాష్ట్రం ఏర్పడింది. కానీ, రాష్ట్రం ఏర్పడ్డాక వారి కుటుంబాల్లో కొన్నింటికే మాత్రమే బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేసింది.అమరులకు స్తూపం కట్టారు. కానీ, ఒక్క పథకానికీ అమరుల పేరు పెట్టలేదు. ప్రస్తుత ప్రభుత్వమూ అంతే అంటూ కవిత మండిపడ్డారు.
అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తామని అధికారంలోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అని కవిత (Kavitha) గుర్తు చేశారు. రాజీవ్, ఇందిర, మన్మోహన్ పేర్లను పథకాలకు పెడుతోంది. కానీ, ఒక్క పథకానికీ శ్రీకాంతాచారి పేరు పెట్టలేదు అని ఆగ్రహించారు. ‘అమరుల పేర్లు ప్రభుత్వ పథకాలకు పెట్టాలన్న ఆలోచన బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు రాలేదు. త్యాగం చేసిన వాళ్లకు గౌరవం దక్కాలి. వారి పేర్లు చరిత్రలో నిలవాలి. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల జాగా, పెన్షన్, గుర్తింపు కార్డులు అందజేయాలి. తెలంగాణ రాష్ట్ర ప్రకటన రోజైన డిసెంబర్ 9న దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయాలి. లేదంటే ప్రభుత్వ భూములను ఉద్యమకారులకు ఇస్తాం. ఆ భూముల్లో జాగృతి జెండాలు పాతుతాం’ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Also: హిల్ట్ పాలసీ లీక్.. ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ!
Follow Us On: Instagram


