కలం డెస్క్ : Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు బాధ్యత లోకల్ ఎమ్మెల్యేలపై పడింది. అటు ఓట్లను రాబట్టడం, ఓటర్లను ఆకర్షించడం, అభ్యర్థుల గెలుపు.. ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యేల బాధ్యతగా మారింది. సభలు, సమావేశాలు, కులాలవారీగా సంఘాలతో మీటింగులు, వారిని కన్విన్స్ చేయడం, ఆర్థిక అవసరాలు.. వీటన్నింటికీ ఎమ్మెల్యేలు సొంత నిధులను ఖర్చు పెట్టుకోక తప్పడంలేదు. ఎమ్మెల్యే ఎన్నికల్లో తన గెలుపు కోసం కష్టపడిన స్థానిక కేడర్‌కు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించడంతో పాటు వారి గెలుపు కోసం సొంతంగా డబ్బులు వెచ్చించాల్సి వస్తున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి, మంత్రుల అధికారిక పర్యటనలు, అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలకు చేస్తున్న ఖర్చుకు ఇప్పుడు ఇది అదనంగా మారింది.
‘దసరా’ నజరానాలు అదనం :
రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు లోకల్ కేడర్‌పై ఆధారపడ్డారు. ఆయా గ్రామాల్లో ఎక్కువ ఓట్లు పడేలా వారు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించారు. దాంతో ప్రత్యర్థి పార్టీ (బీఆర్ఎస్) అభ్యర్థి కంటే ఎక్కువ మెజారిటీతో ఎమ్మెల్యేలు గెలుపొందారు. దీనికి కృతజ్ఞతగా లోకల్ కేడర్‌కు వీలైనంతగా నామినేటెడ్ పోస్టుల కోసం ప్రభుత్వం దగ్గర వారి శక్తి మేరకు చొరవ తీసుకున్నారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. వారిని గెలిపించుకునే బాధ్యతను కూడా భుజాన వేసుకుంటున్నారు. ఇందుకు అవసరమైన ఖర్చును సైతం భరించక తప్పడంలేదు. దీనికి తోడు ఈసారి ‘దసరా’ నజరానాలు సైతం తోడై ఖర్చు ఊహకు అందనంతగా పెరిగింది.
లోకల్ కేడర్ డైలమా :
స్థానిక సంస్థల ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు ప్రకటించడంతో వివిధ స్థాయిల్లోని పదవులకు పోటీ చేయడానికి లోకల్ కేడర్ సిద్ధమవుతున్నారు. వారు సైతం ఎన్నికల్లో గెలవడానికి ఓటర్లను వివిద రూపాల్లో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ‘దసరా మామూళ్ళు’ కూడా ఒక భాగమైంది. ఎన్నికలు జరుగుతాయో లేవోననే అనుమానం ఉన్నా ఆశావహులు ఖర్చు చేయక తప్పలేదు. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ జరుపుతూ ఉన్నందున స్పష్టత రాకుండా ఇప్పుడే ఖర్చు పెడితే ఎన్నికల నాటికి మరిన్ని నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుందనే ఆందోళన కూడా ఆశావహులను వెంటాడుతున్నది. ఈ ఎన్నికలు జరగవు.. బీసీలకు 42% రిజర్వేషన్లను హైకోర్టు అనుమతించదు.. ఇప్పుడే ‘దసరా మామూళ్ళ’ పేరుతో ఖర్చు చేసుకుని డబ్బులు వృధా చేసుకోవద్దు.. అంటూ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

