మునుగోడు(Munugode) ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీరు విభిన్నం. రాష్ట్రంలో మద్యం పాలసీని ఆయన మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. బెల్ట్ షాపులు నిర్వహించడాన్ని తప్పుపడుతున్నారు. పేద ప్రజలు సంపాదన మొత్తం లిక్కర్ కే తగలేస్తున్నారని ఆయన అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండనివ్వనని మొదటి నుంచి చెప్పిన ఆయన .. అదే విధానం అమలు చేశారు. తొలుత లిక్కర్ వ్యాపారులు ఆయన తీరును తప్పుపట్టారు. ఎక్సైజ్ పాలసీ రాష్ట్రం మొత్తం ఒకటే ఉంటుందని అన్నారు. అయితే చివరకు ఎమ్మెల్యేతో గొడవ ఎందుకు? అనుకున్నారేమో కానీ మొత్తానికి దిగొచ్చారు. లిక్కర్ పాలసీకి సంబంధించి రాజగోపాల్ రెడ్డి పెట్టిన షరతులకు కట్టుబడ్డారు.
మునుగోడు నియోజకవర్గంలో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. యావత్ తెలంగాణ అంతటా ఒకే విధమైన మద్యం పాలసీ నడుస్తుంటే.. మునుగోడులో మాత్రం పాలసీ మారింది. ఇటీవల కొత్త మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ కంప్లీట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ సందర్భంలోనే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Raj Gopal Reddy) మద్యం దుకాణాల విషయంలో కొత్తరూల్స్‌ను టెండర్లలో పాల్గొనే వారికి చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు బెల్ట్ షాపులు నిర్వహించొద్దని సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయటే మద్యం విక్రయాలు జరపాలని, పర్మిట్ రూంలకు అనుమతించొద్దని పలు సూచనలు చేశారు. అందులో భాగంగానే డిసెంబర్ 1 నుంచి కొత్తగా తెరుచుకున్న మద్యం దుకాణాలను మునుగోడు నియోజకవర్గంలో ఊరి బయటే ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాతే విక్రయాలు మొదలు పెట్టారు.. సాయంత్రం 6 గంటలకు పర్మిట్ రూంలోకి అనుమతిస్తున్నారు.
వైన్స్ యాజమానులతో స్పెషల్ మీటింగ్..
మునుగోడు(Munugode) నియోజకవర్గంలో మద్యం షాపులు దక్కించుకున్న యజమానులతో హైదరాబాదులోని తన నివాసంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మద్యం షాపులను మధ్యాహ్నం 1 గంట తర్వాత తెరవాలని, సాయంత్రం 6 గంటల నుండి పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని సూచించారు. ఈ అంశాలకు లోబడి మద్యం షాపులు నిర్వహిస్తామని వైన్స్ యాజమానులు మాటిచ్చారు. అందులో భాగంగానే సోమవారం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా కొత్త మద్యం షాపులు ఊరి బయటే మద్యం దుకాణాలను ప్రారంభించాయి. మధ్యాహ్నం 1:00 గంటల నుండి విక్రయాలు ప్రారంభించారు. మరి ఈ విధానం ఎంతకాలం పాటు అమల్లో ఉంటుందో.. ఏలాంటి ఫలితం వస్తుందో వేచిచూడాల్సిందే.
Read Also: మున్నేరు నదిపై కేబుల్ బ్రిడ్జ్: మంత్రి తుమ్మల
Follow Us On: X(Twitter)


