కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు కాంగ్రెస్ నుంచి ఇద్దరు అభ్యర్థులే నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ దాఖలు చేయలేదు. దీంతో ఆ ఇద్దరి ఎన్నిక ఏకగ్రీవం కానున్నది. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత వీరిద్దరి ఎన్నికలను రిటర్నింగ్ ఆఫీసర్ అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీలో వివిధ పార్టీల బలాబలాల రీత్యా కాంగ్రెస్ అభ్యర్థి ఒకరు సులభంగా ఎన్నికయ్యే అవకాశమున్నది. ఒక అభ్యర్థి గెలవడానికి 40 మంది ఎమ్మెల్యేల ఓటు అవసరం. కాంగ్రెస్‌కు మొత్తం 66 మంది, సీపీఐ నుంచి ఒకరి మద్దతు, మజ్లిస్ నుంచి మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున కాంగ్రెస్ మొత్తం బలం 73కు చేరుకున్నది. కానీ ఇద్దరిని గెలిపించడానికి 80 మంది బలం అవసరం. కానీ ఏ పార్టీ నుంచి అభ్యర్థులు బరిలో లేనందున కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన అభిషేక్ మను సింఘ్వి (Manu Singhvi), వేం నరేందర్‌రెడ్డి (Vem Narender Reddy) ఏకగ్రీవమైనట్లే.
అవకాశాన్ని చేజార్చుకున్న బీఆర్ఎస్ :
అసెంబ్లీ స్పీకర్ లెక్కల ప్రకారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 37. అభ్యర్థిని నిలబెట్టినా గెలిపించుకోవాలంటే ఇంకా ముగ్గురి మద్దతు అవసరం. గెలిచే అవకాశం లేకపోయినా పార్టీ ఫిరాయించారంటూ పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేటీఆర్, హరీశ్‌రావు సహా గులాబీ నేతలంతా కామెంట్లు చేశారు. సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అసెంబ్లీ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. వీటిపై ప్రస్తుతం విచారణ జరుగుతూ ఉన్నది. వారిపై అనర్హత వేటు వేయాలన్నది బీఆర్ఎస్ వాదన. ఇప్పుడు రాజ్యసభ (Rajya Sabha) ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఏ అభ్యర్థికి ఓటు వేశారో తెలుసుకోడానికి బీఆర్ఎస్ తన పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెడితే తేలిపోయేది. ఒకవేళ కాంగ్రస్కే ఓటు వేసినట్లయితే పార్టీ ఫిరాయించారనే ఆరోపణలకు లీగల్ బలం చేకూరినట్లయ్యేది. వారిపై అనర్హత వేటు వేయాలని వాదించడానికి ఆస్కారం లభించినట్లయ్యేది. కానీ బీఆర్ఎస్ ఆ అవకాశాన్ని వదులుకున్నది.
Read Also: మన అతిథిని చంపితే మౌనమా?.. ప్రధానిపై రాహుల్ విమర్శ
Follow Us On: X(Twitter)

