కలం, వెబ్ డెస్క్ : నాగర్ కర్నూల్ (Nagar Kurnool) జిల్లాలో సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని ప్రసవం కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. కేజీబీవీలో చదువుతున్న పదహారేళ్ల విద్యార్థిని నిన్న ఓ స్కానింగ్ సెంటర్‌లో బిడ్డకు జన్మనివ్వగా, ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత ఈ వ్యవహారంలో తనతో పాటు చదువుకున్న ఒక బాలుడి ప్రమేయం ఉందని సదరు విద్యార్థిని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. టెన్త్ పరీక్షల సమయంలో సదరు బాలుడితో ఏర్పడిన పరిచయం వల్లే తాను గర్భం దాల్చానని ఆమె చెప్పడంతో, పోలీసులు వెంటనే ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే పోలీసుల విచారణలో ఆ బాలుడు తనకు బాలికతో పరిచయం ఉన్న మాట వాస్తవమేనని, కానీ కేవలం చాటింగ్ మాత్రమే చేసేవాళ్లమని తెలపడంతో కేసు మరో మలుపు తిరిగింది. పోలీసులు డీఎన్ఏ పరీక్షల ద్వారా అసలు నిజాన్ని బయటపెడతామని గట్టిగా ప్రశ్నించడంతో బాలిక అసలు విషయాన్ని బయటపెట్టింది. తన ఇంటి సమీపంలో నివసించే ఓ వివాహితుడైన బంధువు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆమె నిజం ఒప్పుకుంది. దీంతో పోలీసులు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా, అతను తన తప్పును అంగీకరించాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి చర్యలు చేపడుతున్నారు.
Read Also: బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన!
Follow Us On: Youtube

