epaper
Wednesday, March 4, 2026
epaper

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి..?

కలం, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి (Maoist Ganapathi) కేంద్ర ప్రభుత్వం ముందు లొంగిపోయారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సమక్షంలో ఢిల్లీలో సరెండర్ అయ్యారు. గణపతిని కేంద్ర పోలీసు బలగాలు అదుపులోకి తీసుకున్న సమాచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియజేశారు. ఈ పిలుపు కారణంగానే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్ళారు. సీఎం వెంట డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy), ఇంటెలిజెన్స్ హెడ్ సుమతి, అదనపు డీజీపీ విజయ్ కుమార్ తదితరులు కూడా ఉన్నారు. మరికొంత సేపట్లో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ఈ నెల 31న ముగుస్తున్న దానికి నాలుగు వారాల ముందే గణపతిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం. తెలంగాణ, కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగాల సంయుక్త సహకారంతో గత కొన్ని రోజులుగా గణపతి ఆచూకీపై అనేక ప్రయత్నాలు జరిగాయి. చివరకు సక్సెస్ కావడంతో రెండు ప్రభుత్వాలూ పైచేయి సాధించినట్లయింది.

పార్టీలో ఏకాకిగా మిగిలిన గణపతి :

‘పీపుల్స్ వార్‌’గా కొనసాగుతున్నప్పుడే 1991లో పార్టీలో ఏర్పడిన సంక్షోభం సందర్భంగా అప్పటి ప్రధాన కార్యదర్శి కొండపల్లి సీతారామయ్యతో విభేదాలు పొడసూపాయి. మూడేండ్ల తర్వాత కొండపల్లిని పార్టీ నుంచి బహిష్కరించడంతో ప్రధాన కార్యదర్శి బాధ్యతలను గణపతి (Maoist Ganapathi) చేపట్టారు. అప్పటి నుంచి 2018 వరకు ఆ బాధ్యతల్లోనే కొనసాగారు. ఆయన హయాంలోనే పశ్చిమబెంగాల్‌కు చెందిన ‘పార్టీ యూనిటీ’ అనే ఎం-ఎల్ పార్టీ, ఆ తర్వాత బిహార్‌కు చెందిన ‘మావోయిస్టు కమ్యూనిటీ సెంటర్’ (ఎంసీసీ) విలీనం కావడంతో సీపీఐ (ఎం-ఎల్) పీపుల్స్ వార్ పేరు సీపీఐ (మావోయిస్టు)గా మారింది. సుదీర్ఘకాలం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన గణపతి తనంతట తానుగా అనారోగ్య సమస్యలతో తప్పుకునేందుకు పెట్టిన ప్రతిపాదనను కేంద్ర కమిటీ లోతుగా చర్చించి ఆ స్థానంలో నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజును ఎన్నుకున్నది.

నాలుగున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలోనే :

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గణపతి వరంగల్‌లో బీ.ఈడీ ట్రెయినింగ్ చేస్తూనే 1983లో పార్టీవైపు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పటి నుంచి కుటుంబంతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి రహస్య జీవితంలోనే ఉండిపోయిన ఆయన తెలంగాణవైపుగానీ, స్వగ్రామంవైపుగానీ రాలేదు. ఆయన ఎక్కడున్నాడో కుటుంబ సభ్యులు, బంధువులకు సైతం తెలియదు. పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లో లేకపోయినా పోలిట్‌బ్యూరోలో జరిగే చర్చలన్నింటిలో పాల్గొంటూ వ్యూహం, ఎత్తుగడలు లాంటి కీలక నిర్ణయాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో అడవిలో తిరగలేని పరిస్థితుల్లో అర్బన్ ప్రాంతంలో షెల్టర్‌లోకి వెళ్లారని, మావోయిస్టు పార్టీ భాగస్వామిగా ఉన్న ‘కంపోసా’ కూటమిలో సభ్యులుగా ఉన్న నేపాల్‌, ఫిలిప్పీన్స్, భూటాన్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లోని ఎం-ఎల్ పార్టీల సహకారంతో ఆ దేశాల్లో ఉన్నారనే వార్తలూ వచ్చాయి.

కీలక నేతల లొంగుబాటుతో గణపతిపై ఫోకస్ :

మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేతలంతా అటు ఎన్‌కౌంటర్లలో చనిపోవడమో, లొంగిపోవడమో చోటుచేసుకుంటున్న సమయంలో పార్టీలో గణపతి ఏకాకిగా మిగిలిపోయారన్నది కేంద్ర, రాష్ట్ర పోలీసుల  భావన. మానసికంగానూ, శారీరకంగానూ యాక్టివ్‌గా లేరని, అచేతన పరిస్థితుల్లో ఇప్పుడు పార్టీని నడిపించేంత శక్తి లేదని, ఆయన ఆలోచించేంత స్థాయిలో కూడా లేరని, కేడర్ కూడా లేని దయనీయ పరిస్థితుల్లో పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయిందని.. పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మరికొన్ని గంటల్లో గణపతిని తెలంగాణ పోలీసులు లాంఛనంగా లొంగుబాటుగా చూపించనున్నట్లు సమాచారం. గణపతి లొంగిపోవాల్సిందిగా ఆయన కుటుంబ సభ్యులు ఇటీవల ఓపెన్ అప్పీల్ చేసిన రోజుల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం గణపతి సరెండర్ ను చూపించడం గమనార్హం. 

Read Also: అదరగొట్టిన జాన్సేన్.. న్యూజిలాండ్ టార్గెట్ 170

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!