epaper
Wednesday, March 4, 2026
epaper

కొండా ఫ్యామిలీ సంచలన ప్రకటన.. వేడెక్కిన వరంగల్ పాలిటిక్స్ 

కలం, వరంగల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళీ (Konda Murali) మరోమారు సంచలన రాజకీయాలకు తెరలేపారు. తన కూతురు కొండా సుస్మిత పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. మంగళవారం కొమ్మల జాతరలో చేసిన ప్రకటనతో వరంగల్ జిల్లా రాజకీయం వేడెక్కింది.

మురళి ఏమన్నాడు?

‘పరకాల నియోజకవర్గం కొండా ఫ్యామిలీ అడ్డా. రాబోయే రోజుల్లో తమ వారసురాలిగా కొండా సుస్మిత (Konda Susmita) నియోజకవర్గ కార్యకర్తల బాగోగులు చూసుకుంటుంది’ అంటూ మురళి ప్రకటించారు. పరకాల నియోజకవర్గం నుంచి కొండా కుటుంబం పోటీలో ఉంటుందని స్పష్టం చేశారు. ‘చిట్టక్క (సుస్మిత) కొండా మురళీ కంటే ధైర్యవంతురాలని ఆమె తిట్టాలంటే ఎవ్వడిని పడితే వాడిని తిడుతది. వీడు వాడని లెక్కలేదు. కార్యకర్తల కోసం ఏదైనా చేస్తది’ అంటూ కొండా మురళీ ఆవేశంగా ప్రసంగించారు. గీసుగొండ తమ కుటుంబానికి అన్నం పెట్టిన ప్రాంతమని.. కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి, ఇక్కడి జనం దయవల్లే తాను చావు నుంచి బయటపడినట్లు చెప్పిన మురళీ సంచలనం రేపారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి సుస్మిత !

కొండా దంపతుల ఏకైక కూతురు సుస్మిత పటేల్ రాజకీయ అరంగేట్రం దాదాపుగా ఖరరైనట్లేననే ప్రచారం జోరందుకుంది. కొంతకాలంగా ఆమె రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో ఉన్న కొండా దంపతులు తన కూతురిని ఎమ్మెల్యేగా బరిలో నిలపాలని ఆలోచన చేశారు. పార్టీ తరపున వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖకు, పరకాల నుంచి కూతురు సుస్మితకు టికెట్ కేటాయించాలని కొండా మురళీ అధిష్ఠానాన్ని కోరారు. ఇందుకు పార్టీ అంగీకరించని కారణంగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తోపాటు కేటీఆర్‌పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన కొండా సురేఖ ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఫలితంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆమెకు మంత్రి పదవిని కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె కూతురును సైతం ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలని కొండా దంపతులు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి.

పరకాలపై కొండా ఫ్యామిలీ గురి

పరకాల నియోజకవర్గంపై కొండా ఫ్యామిలీ ఎప్పటి నుంచో గురి పెట్టింది. ఈ నియోజకవర్గంలో సుస్మితను బరిలోకి దించి సత్తా చాటాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే మంత్రి కొండా సురేఖ స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై పలుమార్లు విరుచుకుపడ్డారు. ఒకరిపై ఒకరు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొండా సురేఖ ఓఎస్డీ పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని విధుల నుంచి తప్పించారు. ఆ సందర్భంలో ఓఎస్డీ‌ని అరెస్ట్ చేసేందుకు మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడంతో అక్కడే ఉన్న సుస్మిత వారిని అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం కలిగించింది. ఆ తర్వాత కొండా దంపతులు సీఎం ను కలవడంతో వివాదం సమసింది. మళ్లీ ఇన్నాళ్లకు కొండా మురళీ (Konda Murali) తన కూతురు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపుతోంది.

Read Also: రెండు చేతులు లేకపోయినా పారా ఆర్చరీలో అద్భుతాలు.. పాయల్ సరికొత్త చరిత్ర

Follow Us On: X(Twitter)

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!