కలం, వెబ్ డెస్క్: అర్థం పర్థంలేని తన మాటలతో పలుసార్లు నవ్వులపాలైన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. పాకిస్థాన్‌ను సామంత రాజ్యంగా మార్చుకోవాలని ఇజ్రాయెల్, భారత్ కుట్ర చేస్తున్నాయని వింత వాదన తెచ్చారు. ఈ మేరకు మంగళవారం తన ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ ట్వీట్ చేశారు. షరా మామూలుగానే భారత్‌పై విషం కక్కారు.
ఇరాన్‌తో పాకిస్థాన్‌కు దాదాపు 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ రెండు రోజుల నుంచి ఆఫ్ఘనిస్థాన్‌తో బహిరంగ యుద్ధం చేస్తోంది. అదే క్రమంలో స్వదేశంలో బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) స్వతంత్రం కోసం పోరాడుతూ పాక్‌కు కంట్లో నలుసుగా మారింది. ఈ క్రమంలో ఇరాన్‌ను యుద్ధంలో ఓడించడం ద్వారా పట్టు సాధించి, భారత్, ఆఫ్ఘనిస్థాన్‌లతో కలసి ఒక కూటమిగా మారాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. ఈ మూడు దేశాలు ఇరాన్‌ను తమ ఆధీనంలోకి తెచ్చుకొని, బెలూచిస్థాన్ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని, ఆ తర్వాత పాక్‌ను సామంత రాజ్యంగా మార్చుకోవాలని ప్లాన్ వేస్తున్నాయని వితండవాదం చేశారు.
ఇజ్రాయెల్ దేశం ఏర్పడినప్పటి నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇస్లాంను అంతం చేయడానికి ప్రయత్నిస్తోందని ఖవాజా ఆసిఫ్(Khawaja Asif) ఆరోపించారు. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలపై యూదు జాతి(ఇజ్రాయెలీలు) ద్వేష పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిని ఎదుర్కోవడానికి ముస్లిం దేశాలన్నీ ఒక్కటి కావాలని చెప్పారు. పాకిస్థాన్‌లోని ప్రజలందరూ ఇజ్రాయెల్ వ్యతిరేకంగా గళం విప్పాలని రెచ్చగొట్టేలా తన ట్వీట్లో పోస్ట్ చేశారు.
కాగా, ఇరాన్ అధ్యక్షుడు అయతొల్లా ఖమేనీ హత్య అనంతరం పాకిస్థాన్‌లోని అమెరికా ఎంబసీపై ఆందోళనకారులు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా సైన్యం కాల్పుల్లో 20మందికిపైగా మరణించారు. అంతేకాదు, రెండు రోజులుగా పాక్‌లో ఇరాన్‌కు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అగ్నికి ఆజ్యం పోసేలా ఖవాజా ఆసిఫ్ ‘ఎక్స్’లో ట్వీట్ చేయడం ప్రజల్ని మరింత రెచ్చగొట్టడానికేనని భావిస్తున్నారు.

