కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న రెండో సెమీఫైనల్ కోసం భారత్ సిద్ధమవుతోంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు తుది జట్టులో మార్పులపై చర్చ నడుస్తోంది. అయితే, ఫామ్‌లో లేకపోయినా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని, ఓపెనర్ అభిషేక్ శర్మను తప్పించకూడదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కులదీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవడానికి వరుణ్ చక్రవర్తిని పక్కన పెట్టలేమని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు. వరుణ్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నారని, గత మూడు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, తిరిగి పుంజుకునే సత్తా అతనికి ఉందని గుర్తు చేశారు. వాంఖడే స్టేడియంలో మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున అదనపు స్పిన్నర్‌తో వెళ్లడం సాధ్యం కాదని వివరించారు. ప్రత్యర్థి బ్యాటర్లకు రిస్ట్ స్పిన్ ఆడటంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు నమ్ముకున్న ఆటగాడికే మద్దతు తెలపాలని ఆయన సూచించారు.
వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy) ఈ టోర్నీలో 7 ఇన్నింగ్స్‌ల్లో 12 వికెట్లు తీశారు. కులదీప్ యాదవ్.. పాకిస్థాన్‌తో జరిగిన ఏకైక మ్యాచ్‌లో 1/14 గణాంకాలు నమోదు చేశారు. ఓపెనర్ అభిషేక్ శర్మను కూడా జట్టు నుంచి తొలగించవద్దని చోప్రా అభిప్రాయపడ్డారు. ఇదే మైదానంలో ఇంగ్లాండ్‌పై గతంలో అభిషేక్ 135 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడారని, గత మ్యాచ్‌లో కూడా సెంచరీతో రాణించారని ఆయన గుర్తు చేశారు. అభిషేక్ శర్మను చూసి ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయని, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 స్థానంలో ఉన్న అతడిని కొనసాగించడమే సరైన నిర్ణయమని చెప్పారు.
అభిషేక్ శర్మను ‘స్లాగర్’ (కేవలం బంతిని బలంగా బాదే ఆటగాడు) అని మొహమ్మద్ అమీర్ చేసిన విమర్శలను ఆకాశ్ చోప్రా (Aakash Chopra) తోసిపుచ్చారు. కేవలం లెగ్ సైడ్ మాత్రమే కాకుండా, ఆఫ్ సైడ్ మరియు స్ట్రెయిట్ షాట్లు ఆడటంలో అభిషేక్ ప్రతిభ అద్భుతమని, సాంకేతికంగా బలంగా ఉంటే తప్ప ఇలాంటి షాట్లు ఆడటం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ కీలక పోరులో భారత్ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుందా లేక ప్రయోగాలు చేస్తుందా అనేది వేచి చూడాలి.
Read Also: సంగీత్ వీడియో రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ
Follow Us On : WhatsApp

