కలం, వెబ్ డెస్క్: కస్టోడియల్ టార్చర్ చేసినట్లు నమోదైన కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్‌కు(IPS Officer Sunil Naik) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడంలో సునీల్ నాయక్ పాత్ర ఉందని ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రస్తుతం బిహార్‌లో ఫైర్ డిపార్ట్మెంట్ ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నించారు.
అయితే, బిహార్ ప్రభుత్వం అడ్డుకోవడంతో సాధ్యపడలేదు. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ సునీల్ నాయక్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ప్రస్తుతం ఐజీ హోదాలో ఉన్నానని, చట్టానికి గౌరవం ఇచ్చి, విచారణకు పూర్తిగా సహకరిస్తానని, కాబట్టి తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన(IPS Officer Sunil Naik) కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై తాజాగా కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. ఈ నెల 5 నుంచి 9 వరకు దర్యాప్తు అధికారి ముందు సునీల్ నాయక్ హాజరుకావాలని పేర్కొంది. అనంతరం తుది తీర్పును రిజర్వ్ చేసి, ఈ నెల 13కు వాయిదా వేసింది. అయితే, ఆయన విచారణకు హాజరవుతారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. విచారణలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ను బట్టి ఈ కేసులో ముందస్తు బెయిల్‌పై తుది తీర్పు ఆధారపడి ఉంటుంది.

