కలం, వెబ్ డెస్క్: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది. 2025–26కు గాను ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ రేటును 8.25శాతంగా నిర్ణయిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో సోమవారం జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్రీస్(CBT) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2022–23లో వడ్డీ రేటు 8.15శాతానికి పెరగ్గా, ఆ తర్వాత 2023–24లో 8.25కు పెంచారు. అప్పటి నుంచి వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ రేటులో మార్పు లేదు. ఉద్యోగుల పెన్షన్‌పై ఇచ్చే ఈ వడ్డీరేటు పెంచకపోవడంతో ఈపీఎఫ్ లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు.
కాగా, వడ్డీ రేటుపై సీబీటీ ప్రతిపాదనను కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాక, ఈపీఎఫ్‌కు(EPFO) వడ్డీ జమ అవుతుంది. ప్రస్తుతం ఈపీఎఫ్‌లో 7కోట్ల మందికి పైగా లబ్ధిదారులు ఉన్నారు. మరోవైపు బ్యాంకుల్లో ఎవరికీ చెందకుండా ఉన్న ఖాతాల్లోని సొమ్ము (అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల)పైనా కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ.1,000 కంటే తక్కువ సొమ్ము ఉన్న లక్షకు పైగా ఖాతాల్లోని రూ.5.89 కోట్లను సెటిల్ చేయనున్నారు. ఈ అన్క్లెయిమ్డ్ ఖాతాల సొమ్ము గురించి ఇప్పటికే ప్రభుత్వం, ప్రధాని మోదీ పలుసార్లు ప్రజలకు అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.
Read Also: ఫినో బ్యాంక్ సీఈవో రిషి గుప్తా అరెస్ట్..!
Follow Us On: Youtube

