epaper
Monday, March 2, 2026
epaper

సీఎం వర్సెస్ సివిల్ సర్వెంట్స్.. ఆగ్రహం, అనుగ్రహం ఎవరిపై?

కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా అధికారులపై పట్టు రాలేదు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎవరితో ఏ పని చేయించుకోవాలో స్పష్టత లేదు. అధికారులు మాట వినడం లేదంటూ తరచూ మంత్రులు ఫిర్యాదు చేస్తున్నారు. అధికారులపై మంత్రులకు అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎంత లాయల్‌గా ఉన్నా నిందారోపణలు తప్పడంలేదని బ్యూరోక్రాట్లు మొత్తుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) గతేడాది కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఐఏఎస్ ఆఫీసర్లకు సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. ఫీల్డులోకి వెళ్ళాలని, ఏసీ గదులు వీడాలని, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలన్నారు. నెలలు గడిచిపోయాయి. కానీ ఆశించిన ఫలితం రాకపోవడంతో మరోసారి సీరియస్ అయ్యారు. ఈసారి ఎలాంటి కామెంట్లు, విమర్శలు వస్తాయోననే గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.

మనసులోని మాట చెప్పేసిన సీఎం :

కలెక్టర్ల కాన్ఫరెన్సుకు (Collectors Conference) మూడు రోజుల ముందే వివిధ విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. అందులో ముక్కుసూటిగానే కొన్ని కామెంట్లు చేసినట్లు ఆ అధికారులు వాపోయారు. “ఏయే ఆఫీసర్లు సక్రమంగా పనిచేయట్లేదో నాకు తెలుసు… ఉద్దేశపూర్వకంగానే కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు… ఇకపైన నేను కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది.. పనిచేసే చిత్తశుద్ధి లేనప్పుడు వారు పక్కకు తప్పుకోవచ్చు.. ఒకవేళ లాంగ్ లీవ్‌లో వెళ్లినా నాకు అభ్యంతరం లేదు.. వారే స్వయంగా కోరుకుంటే అప్రాధాన్య పోస్టుల్లోకి బదిలీ చేస్తాం.. ఆల్టర్నేట్‌గా ఏం చేయాలో నాకు తెలియందేమీ కాదు.. ఇతర రాష్ట్రాల్లో వాలంటరీ రిటైర్‌మెంట్‌లు అమలవుతున్నాయి.. ఇక్కడ దాన్ని ప్రయోగించాల్సిన అవసరం రావద్దనే అనుకుంటున్నా..” ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు అధికారుల ద్వారా తెలిసింది.

ప్రజా ప్రభుత్వంలో ఫలితాలుండాలి :

ప్రజలు మాండేటరీ ఇచ్చినందునే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజల కోసం పని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని సీఎం, పలు సందర్భాల్ల వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్లు కావస్తున్న సమయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖాముఖి సమావేశంలో ఇవే అంశాలను మరోమారు తీవ్ర స్వరంతో చెప్పే అవకాశమున్నది. ఇప్పటివరకూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అమలు చేసి ప్రజలకు తగిన ఫలాలు ఇవ్వాలన్నది సీఎం స్పష్టమైన అభిప్రాయం. అధికారుల మధ్య ఎలాంటి తేడాలున్నా, ఆధిపత్య పోరు ఉన్నా, వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ నిర్ణయాలు అమలు కావాల్సిందేనన్నది సీఎం, అభిప్రాయం. వివిధ శాఖల మధ్య కొరవడిన సమన్వయం, వ్యక్తిగత విభేదాలతో విధాన నిర్ణయాలు గ్రౌండ్‌లోకి వెళ్ళకపోవడంపై సీఎంకు అసంతృప్తి ఉన్నది. వీటన్నింటినీ కలెక్టర్లు, కార్యదర్శుల సమావేశంలో సీఎం స్పష్టం చేయదల్చుకున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

ఇప్పుడు ఆగ్రహమా?.. అనుగ్రహమా? :

అధికారుల ప్రోగ్రెస్ రిపోర్ట్ తన దగ్గర ఉన్నదంటూ చాలా సందర్భాల్లో చెప్పిన ముఖ్యమంత్రి సచివాలయంలో మంగళవారం జరిగే కలెక్టర్ల కాన్ఫరెన్సులో బహిర్గతం చేయనున్నారు. ఇదే విషయాన్ని కార్యదర్శులకు మూడు రోజుల ముందే చెప్పేశారు. ప్రతి నెల ప్రధాన కార్యదర్శికి పర్‌ఫార్మెన్స్ రిపోర్టు ఇవ్వాల్సిందేనని, ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వయంగా తానే రివ్యూ చేస్తానని గత సమావేశంలో ఐఏఎస్ ఆఫీసర్లకు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. ఆ ప్రకారమే ఇప్పుడు అధికారుల ప్రగతి నివేదికను వెల్లడించనున్నారు. ఆగ్రహం ఎవరిపై? అనుగ్రహం ఎవరిపై? అనే గుబులు పట్టుకున్నది. సీఎం లేవనెత్తే అంశాలకు ఎలాంటి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుందోననే టెన్షన్ మొదలైంది. సీఎం సమావేశమనగానే బ్యూరోక్రాట్లలో ఆందోళన మొదలవుతున్నది.

వరుస బదిలీలతో తగ్గిన కంటిన్యుటీ :

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారులకు బాధ్యతలు అప్పజెప్పడం ఆనవాయితీ. ఆ ప్రకారమే రెండేండ్లలో పలుమార్లు బదిలీలు జరిగాయి. ఒకసారి బదిలీ అయిన తర్వాత కనీసం ఆరు నెలలైనా తిరగకముందే మరోసారి ట్రాన్స్ ఫర్ కావడంతో ఆయా శాఖలపై పూర్తిస్థాయి పట్టు రావడంలేదన్నది కొద్దిమంది బ్యూరోక్రాట్ల వాదన. బాధ్యతలు తీసుకున్న తర్వాత అధికారులతో రివ్యూ చేసి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుని అమలు చేయడానికి సిద్ధమవుతున్న టైమ్‌లోనే బదిలీ కావడంతో కంటిన్యూటీ దెబ్బతింటున్నదనేది వారి భావన. సమర్ధులైన అధికారులను గుర్తించి బాధ్యతలు అప్పజెప్పినా వివిధ స్థాయిల్లోని ఆఫీసర్ల మధ్య సమన్వయం లేకపోవడం, ఇగో సమస్యలు రావడం, సీనియర్-జూనియర్ తేడాలు.. ఇవన్నీ ప్రభుత్వానికి సవాలుగా మారాయి. కలెక్టర్ల సమావేశంలో సీఎం రియాక్షన్‌పై ఉత్కంఠ నెలకొన్నది.

Read Also: డిజిటల్ హెల్త్ కార్డు.. ఫోటో, క్యూఆర్ కోడ్

Follow Us On: Instagram

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!