కలం, వెబ్ డెస్క్ : టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన జోరులో ఉన్న టీమిండియా(India) తదుపరి సిరీస్‌కు సిద్ధమైంది. జూన్ 2026లో ఆఫ్ఘానిస్తాన్ (Afghanistan) జట్టు భారత పర్యటనకు రానున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఒక టెస్టు మ్యాచ్‌తో పాటు మూడు వన్డేలు జరగనున్నాయి. జూన్ 6 నుండి 10 వరకు మొహాలీ సమీపంలోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ వేదికపై నిర్వహించనున్న మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఇదే కావడం విశేషం. అనంతరం జూన్ 14న ధర్మశాలలో మొదటి వన్డే, జూన్ 17న లక్నోలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో చివరి వన్డే మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.
ఆదివారం వెస్టిండీస్‌పై గెలిచి వరల్డ్ కప్ సెమీస్‌కు చేరిన టీమిండియా(India), టైటిల్‌ను కాపాడుకునే దిశగా సాగుతోంది. మరోవైపు 2024 వరల్డ్ కప్‌లో సెమీస్‌కు చేరిన ఆఫ్ఘానిస్తాన్(Afghanistan), ఈసారి మాత్రం గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. గత రికార్డులను పరిశీలిస్తే, టెస్టు క్రికెట్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒకేసారి తలపడ్డాయి. 2018లో బెంగళూరులో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 262 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వన్డేల విషయానికి వస్తే.. నాలుగు మ్యాచ్‌లలో భారత్ మూడింటిని గెలుచుకోగా, ఒక మ్యాచ్ టైగా ముగిసింది. రాబోయే సిరీస్ ఇరు జట్లకు కీలకమైన సవాల్‌గా మారనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నిబంధనల ప్రకారం ఈ సిరీస్ సజావుగా సాగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

