కలం, వెబ్ డెస్క్: ఇరాన్‌తోపాటు గల్ఫ్ ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయా దేశాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. దీంతో వారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక సూచనలు చేశారు. తెలుగు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యుద్ధం కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో భద్రతా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఆయా దేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను ఎప్పటికప్పుడు పాటించాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రజలను సురక్షితంగా రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటుందని అన్నారు. ఇరాన్, ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలంగాణ వాసుల పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పరిశీలిస్తున్నదని తెలిపారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఆయా దేశాల్లో ఉన్న భారత ఎంబసీలు, కాన్సులేట్తోనూ సంప్రదింపులు జరపాలని ఆదేశించారు. తెలంగాణ ప్రజల భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

