కలం, వెబ్ డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ మృతితో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు, మద్దతుదారులు కంటతడి పెడుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ తీరును నిరసిస్తూ ర్యాలీలు చేస్తున్నారు. భారత్‌లోనూ పలుచోట్ల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో కర్ణాటకలోని ఓ గ్రామం (Alipur Village) ఖమేనీ మృతితో శోకసంద్రంలో మునిగిపోయింది.
చిక్‌బళ్లాపుర జిల్లా గౌరిబిదనూరు తాలూకా అలీపుర గ్రామానికి అయతొల్లా ఖమేనీతో ప్రత్యేక అనుబంధం ఉంది. రాష్ట్ర రాజధాని బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామంలో 25వేలకు పైగా జనాభా ఉంది. ఇందులో 90శాతానికి పైగా షియా ముస్లింలు. ఈ కుటుంబాలన్నింటికీ నేరుగా ఇరాన్‌తో సంబంధం ఉంది. అందుకే దీన్ని ‘మినీ ఇరాన్’గా పిలుస్తారు.
అయతొల్లా ఖమేనీ 1986లో ఈ గ్రామానికి (Alipur Village) వచ్చారు. అప్పట్లో మత ప్రబోధకుడిగా ఆయన అలీపురను సందర్శించారు. గ్రామంలో మత బోధనలు, ప్రార్థనలు నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన పేరుతో ఇక్కడొక ఆస్పత్రి కూడా ఉంది. అనంతరం కొన్నేళ్ల తర్వాత ఆయన ఇరాన్ సుప్రీం కాగానే, అలీపుర గ్రామస్థులకు తమ దేశంలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో అవకాశమిచ్చారు. వీటిని అందిపుచ్చుకొని అలీపుర నుంచి ఎంతో మంది ఇరాన్ వెళ్లి స్థిరపడ్డారు. అలాగే చాలామంది ఇరాన్లో ఎంబీబీఎస్ చదివారు. చదువుతున్నారు.
ఖమేనీ (Ayatollah Khamenei) మృతి చెందారనే వార్త ఆదివారం ఉదయం తెలియగానే గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. అంజుమన్ ఇ జఫారియా కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్థులు.. ఖమేనీ ఆత్మ శాంతికోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. షాపులు, వ్యాపారాలు మూసివేశారు. గ్రామంలో మూడు రోజులు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించారు. ఈ మూడు రోజులు వేడుకలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని తీర్మానించారు. అనంతరం వేలాది మంది ప్రదర్శన నిర్వహించారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

