epaper
Tuesday, November 18, 2025
epaper

కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు పరీక్ష.. BRS సరికొత్త స్కెచ్

కలం డెస్క్ : రాష్ట్రంలోని గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూలు ప్రకటించడంతో రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందనే చర్చ ఎలా ఉన్నా బీజేపీ సైతం ఈసారి గ్రామీణ ప్రాంతంలో చొచ్చుకుపోవాలని భావిస్తున్నది. రెండేండ్ల కాంగ్రెస్ పాలనకు స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రిఫరెండంగా మారే అవకాశమున్నది.

సక్సెస్ వర్సెస్ ఫెయిల్యూర్ :

ఈ రెండేండ్ల కాలంలో సాధించిన ఫలితాలను, వివిధ సెక్షన్ల ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించిన సాయాన్ని కాంగ్రెస్ ఏకరువు పెట్టాలనుకుంటున్నది. రెండేండ్లలో అమలు చేయని పథకాలను జనంలోకి వివిధ రూపాల్లో తీసుకెళ్ళాలని బీఆర్ఎస్ స్కెచ్ వేస్తున్నది. తాజాగా ఏర్పడిన యూరియా కొరతను హైలైట్ చేయాలనుకుంటున్నది. మరోవైపు మోడీ ఇమేజ్ తో పాటు కేంద్రం అమలుచేస్తున్న పథకాల ఫలాలపై బీజేపీ ఆధారపడుతున్నది. ఇందుకు జీఎస్టీ 2.0 ఉపశమనాన్ని వాడుకోవాలనుకుంటున్నది.

భవిష్యత్తుపై లోకల్ ఎఫెక్ట్ :

స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఫలితం ఆయా పార్టీల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నది. త్వరలో జరగనున్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపైనా ఎఫెక్టు పడనున్నది. వార్డు సభ్యుల మొదలు జెడ్ పీ చైర్ పర్సన్ వరకు గెలుపు ఆయా పార్టీల బలాబలాలకు నిదర్శనంగా మారనున్నది. అధికారంలో ఉన్నందున విజయంపై కాంగ్రెస్ దృష్టి పెట్టింది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమిని పరిగణనలోకి తీసుకుని బలపడాలని బీఆర్ఎస్ ఆరాట పడుతున్నది. లోక్ సభ ఎన్నికల్లో వచ్చిన గెలుపును స్థానిక స్థాయిలోనూ నిలుపుకోవాలన్నది బీజేపీ దీర్ఘ దృష్టి. ఈ ఫలితాలు పలు పార్టీల ఫ్యూచర్ ను డిసైడ్ చేయనున్నాయి.

పథకాలపై కాంగ్రెస్ ధీమా :

రైతు రుణమాఫీ, రైతుభరోసా, సన్న వడ్లకు బోనస్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి స్కీమ్ ద్వారా ఇండ్లకు ఉచిత విద్యుత్, కొత్త రేషను కార్డుల జారీ, రేషను దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ.. ఇలాంటి పథకాలన్నీ అనుకూలంగా మారుతాయన్నది కాంగ్రెస్ భావన. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీని కాదని ప్రతిపక్షాన్ని గెలిపిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులతో అభివృద్ధి కుంటుపడుతుందనే అభిప్రాయమూ లేకపోలేదు. వీటన్నింటి నడుమ స్థానిక ఫలితాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం.

దిద్దుబాటుకు స్కోప్ :

స్థానిక ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాకపోతే రివ్యూ చేసుకుని సంక్షేమ పథకాల అమలును స్పీడప్ చేయడానికి కాంగ్రెస్ కు అవకాశం దక్కుతుంది. మూడేండ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి పరిస్థితిని చక్కదిద్దుకోడానికి వీలు ఉంటుంది. అదే సమయంలో బీఆర్ఎస్ అంచనాలు తలకిందులైతే జనంలో ఇప్పటికీ వ్యతిరేకత కొనసాగుతూనే ఉందన్న వాస్తవాన్ని గ్రహించి తగిన కార్యాచరణకు మార్గం ఏర్పడుతుంది. బీజేపీ సైతం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ లోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నందున ఇప్పుడు గ్రామీణ ప్రజల మనసును గెల్చుకోవడం తప్పనిసరి షరతుగా మారుతుంది.

ప్రచారంపై ప్రధాన ఫోకస్ :

అధికార, ప్రతిపక్ష పార్టీలు గ్రామాల్లో ప్రజల మధ్యకు తీసుకెళ్ళాల్సిన ప్రచార రూపాలపై ఇప్పటికే ఫోకస్ పెట్టాయి. స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని వార్డు సభ్యుల మొదలు వీలైనన్ని ఎక్కువ స్థానాలను గెల్చుకునేలా పీసీసీ బాధ్యతలు అప్పజెప్పింది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ సైతం బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్ల ద్వారా గ్రామాల్లో విజిబుల్ డిస్ ప్లే చేయాలనుకుంటున్నది. సోషల్ మీడియా గ్రామాల్లోకి చొచ్చుకెళ్ళినందున వారికి అర్థమైన తీరులో ప్రచార రూపాలపై ప్లాన్ చేస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>