కలం, వెబ్ డెస్క్: టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 లో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది (Pakistan Vs Sri Lanka). కానీ, సెమీస్‌కు మాత్రం చేరలేకపోయింది. ఇప్పటికే టోర్నీ నుంచి అవుటయిన శ్రీలంక పోతూ పోతూ తమతోపాటు పాక్‌ను కూడా తీసుకెళ్లింది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిచిన పాక్ జట్టు మూడు పాయింట్లు చేరుకుంది. న్యూజిలాండ్ కూడా అదే విధంగా 3 పాయింట్లతో టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో రన్‌రేట్‌ను లెక్కిస్తారు. ఆ విధంగా రన్‌రేట్‌తో సెమీస్‌కు వెళ్లాలంటే పాకిస్థాన్ కనీసం 64 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంది. కానీ ఈ మ్యాచ్‌లో కేవలం 5 పరుగుల తేడాతోనే గెలవడంతో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫర్హాన్ సెంచరీ చేసినా ఫలితం లేకుండా పోయింది. శ్రీలంక బ్యాటింగ్ లైనప్ కుప్పకూలినా.. పవన్ రత్నాయకే, దాసున్ శనక మ్యాచ్‌ను నిలబెట్టారు. శ్రీలంక ఓటమి పక్కా అన్న దగ్గర నుంచి గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయన్న దగ్గరకు తీసుకెళ్లారు. ఆఖరి మూడు బంతులు ఉన్న సమయంలో మ్యాచ్ శ్రీలంకదే అన్న ఫీల్ కూడా వచ్చింది. కానీ చివరి రెండు బంతులు డాట్స్‌గా మిగలడంతో శ్రీలంక ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసింది(Pakistan Vs Sri Lanka). పాక్ ఓపెనర్లలో ఫకర్ జమాన్ 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మరోవైపు సాహిబ్‌జాదా ఫర్హాన్ 60 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టుకు పటిష్టమైన పునాది వేశాడు. ఓపెనర్లు నిష్క్రమించిన తర్వాత పాక్ మిడిల్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. ఖవాజా నఫాయ్ (2), షాదాబ్ ఖాన్ (7), మహమ్మద్ నవాజ్ (0), కెప్టెన్ సల్మాన్ ఆఘా (0) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. చివరలో ఉస్మాన్ ఖాన్ 6 పరుగులు జోడించడంతో జట్టు స్కోరు 200 మార్కును దాటింది. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు తీసి రాణించగా, శనక రెండు, చమీర ఒక వికెట్ పడగొట్టారు.
213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక చివరి వరకు పోరాడి 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. లంక కెప్టెన్ శనక కేవలం 30 బంతుల్లోనే 8 సిక్సర్లు, 2 ఫోర్లతో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. పవన్ రత్నాయకే (58) కూడా అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4 ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు తీసి లంకను దెబ్బకొట్టాడు.

