epaper
Sunday, March 1, 2026
epaper

ఓవైసీ సోదరుల చేతిలో ప్రభుత్వ స్టీరింగ్.. రేవంత్‌పై బీజేపీ నేతల ఆగ్రహం

కలం, నిజామాబాద్ బ్యూరో: శనివారం కామారెడ్డి (Kamareddy)లో బీజేఎల్పీ సమావేశం జరిగింది. శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు దన్ పాల్ సూర్యనారాయణ గుప్త, పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పవార్, ఎమ్మెల్సీలు అంజి రెడ్డి, ఎవీఎన్ రెడ్డి హజరయ్యారు. ఇటీవల కామారెడ్డిలో జరిగిన పరిణామాలు, గొందరగోళ పరిస్థితులపై బీజేపీ ఎల్పీ సమావేశమైంది. అనంతరం మీడియా సమావేశంలో శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఎమ్మెల్యేపైనే దాడి జరిగితే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోకుండా బీజేపీ కార్యకర్తలపై కేసులు పెట్టారని మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ గతి తప్పిందనడానికి ఇటీవల జరిగిన ఘటనలు నిదర్శనం అని, వీటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీ బలమేంటో ఇటీవల జరిగిన ఎన్నికలే తెలియజేశాయన్నారు. రాబోయే రోజుల్లో బీజేపీ (BJP)ని గెలిపించే దిశగా ప్రజలు కదులుతున్నారన్నారు. ఎమ్మెల్యే రమణారెడ్డి పరామర్శకు వెళ్లే నేతలను హౌస్ అరెస్ట్ చేశారన్నారు‌. రాష్ట్రంలో హోం శాఖ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుందా, ఎంఐఎం ఆధ్వర్యంలో కొనసాగుతుందా తెలియడం లేదన్నారు. బాన్సువాడ ఘటనలో బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారని ఏలేటి ఆరోపించారు.

ఓవైసీ అన్నదమ్ములకు రాష్ట్ర ప్రభుత్వ స్టీరింగ్ అప్పగించినట్టు ఉందని ఏలేటి ఆరోపించారు. రాష్ట్రంలో రైతు భీమా అమలుచేయాలని అసెంబ్లీలో ఒత్తిడి తెస్తామని, హామీలను అటకెక్కించి, రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసిందన్నారు. విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు‌. రైతుల సమస్యలపై ఆదిలాబాద్ నుంచి లక్ష మంది రైతులతో వినతి పత్రాలు స్వీకరిస్తామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడారు. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఘటన బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!