కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో (Velugumatla) నిరుపేదల ఇండ్లను నేలమట్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం ఆయన స్థానిక నాయకులతో కలిసి వెలుగుమట్లలోని భూదాన్ (Bhoodan Lands) బాధితులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పదికి తొమ్మిది స్థానాలు కట్టబెట్టిన ఖమ్మం ప్రజల పట్ల అధికార పక్షం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ముగ్గురు కీలక మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో రక్షణ లేకుండా పోవడం శోచనీయమన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నదీ ప్రక్షాళన సుందరీకరణ పేరుతో ఇళ్లను ఏ విధంగా నేలమట్టం చేశారో, అలాగే ఖమ్మం (Khammam)లో కూడా నేలమట్టం చేశారని మండిపడ్డారు. సొంత ఊళ్లలో బతుకుదెరువు లేక వలస వచ్చిన అభాగ్యులు అని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదువుకున్న అధికారులు పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారి కనీస మానవత్వం లేకుండా వ్యవహరించడం దారుణమని ఈటల రాజేందర్ విమర్శించారు. న్యాయస్థానం ఆదేశాలు లేకుండానే తెల్లవారుజామున నాలుగు గంటలకే పేదల గుడిసెలను నేలమట్టం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలపై ప్రతాపం చూపుతున్న ముఖ్యమంత్రికి బడాబాబులు ఆక్రమించుకున్న వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కూల్చే దమ్ము ఉందా అని మరోసారి సవాల్ విసిరారు. ఈ కూల్చివేతలకు కారణమైన అధికారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇళ్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి అదే స్థలంలో రెండు పడక గదుల ఇళ్లు నిర్మించాలన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఈటల (Eatala Rajendar) డిమాండ్ చేశారు.
Read Also: శారద పీఠానికి భూముల కేటాయింపు.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం
Follow Us On: X(Twitter)

