కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో (Revanth Reddy) గంటన్నర పాటు మాజీ మావోయిస్టుల సమావేశం జరిగిన తర్వాత ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి దేవ్‌జీ (Devji) ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. మల్లా రాజిరెడ్డి మాత్రం దీనికి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. మూడు రోజుల క్రితం లొంగిపోయిన సందర్భంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని స్పష్టంగా వెల్లడించిన దేవ్‌జీ తాజాగా సీఎంతో జరిగిన సమావేశంలో ఆ అభిప్రాయాన్ని పంచుకున్నట్లు సమాచారం. తుపాకీతో ఉద్యమం చేసే రోజులు ఇప్పుడు లేవని వ్యాఖ్యానించిన దేవ్‌జీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నట్లు లొంగుబాటు సందర్భంగానే వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిలో సచివాలయంలో సమావేశానికి హాజరయ్యేందుకు చేరుకున్న దేవ్‌జీని పాత్రికేయులు ప్రశ్నించగా, రాజకీయాల గురించే చర్చ ఉంటుందని, వాటినే ఆయన దృష్టికి తీసుకెళ్తామని బదులిచ్చారు.
ప్రజా జీవితంలో ఉంటా.. పార్టీల్లో చేరను : మల్లా రాజిరెడ్డి
ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ఆసక్తితో ఉన్న దేవ్‌జీ (Devji) తన మనస్తత్వానికి కాంగ్రెస్ మాత్రమే సరిపోతుందనే అభిప్రాయాన్ని సీఎంతో భేటీ సందర్భంగా ప్రస్తావించినట్లు తెలిసింది. మల్లా రాజిరెడ్డి మాత్రం ప్రజా జీవితంలో ఉంటానే తప్ప ఏ రాజకీయ పార్టీలోనూ చేరాలన్న ఆసక్తి లేదనే అంశాన్ని నొక్కిచెప్పినట్లు తెలిసింది. మిగిలినవారి విషయం గురించి వివరాలు వెలుగులోకి రాకపోయినప్పటికీ బడే చొక్కారావు మాత్రం ములుగు ప్రాంత ప్రజలు తనను రాజకీయాల్లోకి రావాలని, అక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దీంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీవైపే మొగ్గు చూపి వచ్చే ఎన్నికల్లో ములుగు జిల్లాతో పాటు ఏ జిల్లాలో పోటీ చేస్తే అనుకూలంగా ఉంటుందో పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
Read Also: పాలసీ సవరణకు దేవ్‌జీ డిమాండ్.. సీఎం పాజిటివ్
Follow Us On: X(Twitter)

