Mobile Popup Ad
Mobile Popup Ad

రైతు రిజిస్ట్రీ నమోదులో తెలంగాణ టాప్

కలం, వెబ్ డెస్క్:  డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాల అమలులో తెలంగాణ (Telangana) రాష్ట్రం మరో కీలక మైలురాయిని సాధించింది. రైతు రిజిస్ట్రీ నమోదు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని మించి 110 శాతం సాధనతో దేశంలో అగ్రగామిగా నిలిచింది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం పట్టాదారుల సంఖ్య 73.82 లక్షలు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 39,77,791 మంది రైతులను నమోదు చేయాలని లక్ష్యం విధించింది. అయితే తెలంగాణ రాష్ట్రం లక్ష్యాన్ని అధిగమించి 43,59,371 మంది రైతులను నమోదు చేసి 110 శాతం సాధించింది.

దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి (Special Central Assistance – SCA) కింద రూ.422.64 కోట్ల ప్రోత్సాహకాన్ని మంజూరు చేసింది. రైతు రిజిస్ట్రీ సృష్టి మరియు అమలులో రాష్ట్రం చూపిన పనితీరుకు ఈ ప్రోత్సాహకం లభించినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.

ఈ విజయానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వం, దూరదృష్టి ప్రధాన కారణమని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యాలయం నుంచి గ్రామ స్థాయి వరకు సమన్వయంతో పనులను సమీక్షిస్తూ నమోదు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించడం వల్లే లక్ష్యం సాధ్యమైందని వెల్లడించారు.

మిగిలిన పట్టాదారులను కూడా త్వరితగతిన నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, అర్హులైన రైతులందరినీ పూర్తిస్థాయిలో చేర్చే దిశగా క్షేత్ర స్థాయిలో ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారులు (AEOలు), మండల వ్యవసాయ అధికారులు (MAOలు), క్షేత్ర సిబ్బంది, సాంకేతిక బృందాలు మరియు జిల్లా స్థాయి అధికారులు సమన్వయంతో పనిచేయడంతో ఈ విజయాన్ని సాధించగలిగినట్లు మంత్రి అభినందించారు.

రైతు రిజిస్ట్రీ ద్వారా వ్యవసాయ రంగంలో పారదర్శకత పెరగడంతో పాటు సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమయానుకూలంగా నేరుగా అందే విధంగా డేటా ఆధారిత వ్యవసాయ పరిపాలనకు బలమైన పునాది ఏర్పడిందని అధికారులు తెలిపారు. డిజిటల్ వేదికల వినియోగంతో రైతు సంక్షేమం, సేవల మెరుగుదల  సుస్థిర వ్యవసాయ అభివృద్ధి దిశగా తెలంగాణ ప్రభుత్వం తన నిబద్ధతను కొనసాగిస్తుందని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>