కలం, వెబ్ డెస్క్: పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్(Afghanistan) మధ్య పోరు మరింత ముదురుతోంది. రెండు దేశాల్లోనూ భీకర దాడులు జరుగుతున్నాయి. ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌తోపాటు పలు కీలక నగరాలపై పాక్ వైమానిక దళం విరుచుకుపడుతోంది. మరోవైపు తాలిబన్స్ సైతం వెనక్కు తగ్గడం లేదు. ఏకంగా పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో బాంబు దాడులకు దిగారు. పాక్ ప్రధాని షాహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ప్రధాన కార్యాలయానికి(పీఎంవో)కు ఆరు కిలోమీటర్ల సమీపంలో శుక్రవారం శక్తిమంతమైన బాంబు పేలుళ్లు జరిగాయి. సూసైడ్ డ్రోన్లు, వైమానిక దాడులతో ఈ పేలుళ్లు జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో ఎంత మంది మరణించింది తెలియనప్పటికీ, భారీ స్థాయిలోనే ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు అంతర్జాతీయ వార్తా కథనాలు చెబుతున్నాయి.
ఈ దాడులకు తామే కారణమని ప్రకటించుకున్న తాలిబాన్.. ఇస్లామాబాద్లోని (Islamabad) ఫైజాబాద్–తబుస్సమ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో కీలక సైనిక లక్ష్యాలు, అణుస్థావరాలపై దాడులు చేసినట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాయి. పాక్ ప్రభుత్వం తమ మీద ప్రకటించిన ఆపరేషన్ ‘ఘజబ్ లిల్ హక్’కు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు వెల్లడించాయి. అత్యంత భద్రత ఉండే దేశ రాజధానిలో బాంబు పేలుళ్లు జరగడంతో పాకిస్థాన్ ఉలికిపడింది. దీని వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడుతోంది.
మరోవైపు దాడుల్లో మరణించిన వాళ్ల సంఖ్యపైనా రెండు దేశాలు చెరో మాట చెబుతున్నాయి. తమ దాడుల్లో ఆఫ్ఘాన్‌కు సైనికులు 133 మంది చనిపోయారని పాక్ ప్రకటించగా.. తాము చేసిన దాడుల్లో 55 మంది పాక్ సైనికులు మృతి చెందారని ఆఫ్ఘనిస్థాన్(Afghanistan) అంటోంది.
పాక్, ఆఫ్ఘన్ మధ్య యుద్ధం మరింత ముదరకుండా చూసేందుకు రష్యా, చైనా, ఇరాన్ ప్రయత్నిస్తున్నాయి. రెండు దేశాలను శాంతించాలంటూ కోరాయి.
Read Also : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై అన్నా హజారే రియాక్షన్ ఇదే
Follow Us On: Youtube

