కలం, వెబ్ డెస్క్ : కర్ణాటక మరోసారి అధికార మార్పిడి సెగలు రాజుకున్నాయి. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) వర్గానికి చెందిన సుమారు 30 మంది ఎమ్మెల్యేలు బెంగళూరులోని ఒక ప్రైవేట్ హోటల్లో రహస్యంగా సమావేశం కావడం సంచలనంగా మారింది. ఇద్దరు మంత్రులు కూడా ఈ భేటీలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గత కొద్దిరోజుల క్రితమే దాదాపు 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విదేశీ పర్యటనకు వెళ్లగా, వారు తిరిగి రాగానే ఇప్పుడు డీకే శివకుమార్ వర్గం ఎమ్మెల్యేలు భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఒక ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకల నెపంతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పైకి చెబుతున్నప్పటికీ, అసలు ఉద్దేశం మాత్రం నాయకత్వ మార్పుపై చర్చించడమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాబోయే రోజుల్లో అధిష్టానం తీసుకోబోయే నిర్ణయాలకు అనుగుణంగా తమ వ్యూహాలను ఎలా సిద్ధం చేసుకోవాలనే అంశంపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ((DK Shivakumar)) మధ్య అధికార పంపకాల ఒప్పందం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు ఇచ్చే సంకేతాల కోసం ఈ వర్గం ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బహిరంగంగా అంతా సవ్యంగానే ఉందని పార్టీ నేతలు చెబుతున్నా, హోటల్ వేదికగా జరిగిన ఈ రహస్య భేటీ కర్ణాటక కాంగ్రెస్లో అంతర్గత విభేదాలు ఉన్నాయనే అనుమానాలను బలపరుస్తోంది.

