కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’పై (Operation Kagar) స్వయంగా ప్రధాని మోడీ (Narendra Modi) సంచలన వివరాలను వెల్లడించనున్నారు. ‘మావోయిస్టు రహిత భారత్’ (మావోయిస్ట్ ముక్త్ భారత్) ప్రకటించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పుష్కర కాలంలో ఎన్నడూ ప్రెస్ మీట్ పెట్టలేదు. ఫస్ట్ టైమ్ ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాలనుకుంటున్నారు.
ఆపరేషన్ కగార్ కోసం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న మార్చి 31 డెడ్‌లైన్ తర్వాత ఢిల్లీలోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్సు జరగనున్నది. దీనికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలు (DGP), ఇంటెలిజెన్స్ (Intelligence) హెడ్‌లతో పాటు కేంద్ర భద్రతా బలగాల, పారామిలిటరీ ఫోర్సుల హెడ్‌లను కూడా ఆహ్వానించనున్నారు. ఈ ఆపరేషన్ ఎందుకు చేపట్టాల్సి వచ్చింది.. అమలు కోసం చేసిన కసరత్తు.. వివిధ రాష్ట్రాలతో సమన్వయం.. పోలీసు బలగాల సహకారం.. యాంటీ నక్సల్ (Anti-Naxal) విభాగాల చీఫ్‌లు.. ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ చేసిన కృషి.. వీటన్నింటిని వివరించాలనుకుంటున్నారు.
దాదాపు ముగింపు దశకు చేరిన ‘Operation Kagar’ :
గతంలోని కేంద్ర ప్రభుత్వాలు ఆపరేషన్ గ్రీన్ హంట్ (Green Hunt), ఆపరేషన్ ప్రహార్, ఆపరేషన్ సమాధాన్ (Samadhan), ఆపరేషన్ కవచ్ (Operation Kavach).. ఇలా అనేక పేర్లతో మావోయిస్టుల, నక్సలైట్ల ఏరివేత కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి. వీటికి తోడు ఆ ఉద్యమాన్ని నిర్మూలించడానికి యాంటీ నక్సల్ స్క్వాడ్, గ్రేహౌండ్స్ (Grey Hounds), సాల్వజుడుం (చత్తీస్‌గఢ్), సీఆర్‌పీఎఫ్‌లో ‘కోబ్రా’ (COBRA), మహారాష్ట్రలో సీ-60, చత్తీస్‌గఢ్‌లో డీఆర్‌జీ (DRG), ఒడిశాలో ఎస్ఓజీ (SOG).. ఇలా అనేక ప్రత్యేక పోలీసు విభాగాలు ఏర్పడ్డాయి.
వీటికి కొనసాగింపుగా కేంద్ర ప్రభుత్వం 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (Operation Kagar) పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. మావోయిస్టు ముక్త్ భారత్ లక్ష్యంగా దేశవ్యాప్తంగా సంయుక్త చర్యలకు శ్రీకారం చుట్టింది. నిర్దిష్టంగా 2026 మార్చి 31 వరకు దేశంలో ఎక్కడా మావోయిస్టు కార్యకలాపాలు లేకుండా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. ఇప్పటివరకు దాదాపు 90 శాతానికి పైగానే ఆపరేషన్ పూర్తయిందన్నది కేంద్ర సర్కార్ భావన. సాధించిన ఫలితాలపై హోం మంత్రి అమిత్ షా ఇటీవలే రివ్యూ చేశారు.
ఎన్‌కౌంటర్లు, సరెండర్లు, కూంబింగ్ చర్యలు :
ఆపరేషన్ కగార్ ఆశించిన పలితాలే ఇస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఒకవైపు కూంబింగ్ చర్యలతో సైనికంగా ఏరివేత చర్యలు చేపడుతూనే మరోవైపు లొంగుబాట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాయి. గతేడాది సెప్టెంబరు నుంచి పదుల సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర కమిటీల సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోయారు.
వందల సంఖ్యలో డివిజన్, జిల్లా, ఏరియా కమిటీల సభ్యులు లొంగిపోయారు. పీఎల్‌జీఏ (PLGA) బెటాలియన్లలోని కంపెనీల కమాండెంట్లు, మిలిటరీ కమిషన్ సభ్యులు, ప్లాటూన్ సహా దళాల కమాండర్లు, మిలీషియా సభ్యులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. పదుల సంఖ్యలో కేంద్రకమిటీ, పోలిట్‌బ్యూరో, రాష్ట్రకమిటీలు, స్పెషల్ జోనల్ కమిటీల నేతలు ఎన్‌కౌంటర్‌లలో హతమయ్యారు. ఈ ఘటనలతో మావోయిస్టు కేడర్ డీమోరల్ అయ్యి సరెండర్ల బాట పట్టారు.
మిగిలింది గణపతి సహా కొద్దిమంది నేతలే :
పాతిక మందితో ఉన్న కేంద్ర కమిటీ ఇప్పుడు ముగ్గురికి మాత్రమే పరిమితమైందని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటించారు. టాప్ మోస్ట్ లీడర్ గణపతి సహా కొద్దిమంది మాత్రమే ఉన్నారని, ఇందులో యాక్టివ్‌గా ఉన్నది చాలా తక్కువ అని తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకోడానికి, అరెస్టు చేయడానికి, లొంగిపోయేలా ఒత్తిడి చేసేందుకు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.
డెడ్‌లైన్‌కంటే ముందే టార్గెట్ కంప్లీట్ అవుతున్నదని అమిత్ షా సహా ఆయా రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, పోలీసు ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. నెల రోజుల వ్యవధిలో ఆపరేషన్ కగార్‌ను సంపూర్ణంగా పూర్తి చేసి ప్రధాని ద్వారా మొత్తం దేశానికి ఒక స్పష్టమైన మెసేజ్ ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఆ తర్వాత చేపట్టబోయే కార్యాచరణ ఏంటనేది కూడా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా ఆ వేదికగా ప్రకటించే అవకాశమున్నది. డెడ్‌లైన్ తర్వాత ఏ రోజున ప్రెస్ కాన్ఫరెన్సు ఉండేదీ కేంద్రం ప్రకటించనున్నది.
Read Also: నేపాల్ లో గణపతి .. కీలక వ్యాఖ్యలు
Follow Us On: Youtube

