epaper
Tuesday, November 18, 2025
epaper

అగ్నిపరీక్షగా మారిన బీహార్ ఎలక్షన్స్

కలం డెస్క్ : మరో రెండు నెలల్లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికలు పలు పార్టీల భవిష్యత్తుకు అగ్నిపరీక్షగా మారనున్నది. దేశ రాజకీయాలనే మలుపు తిప్పే ఎన్నికలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, జేడీయూ, మరికొన్ని పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమిగా పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా పోటీచేస్తున్నాయి. రాజకీయ పార్టీల సమీకరణాలు మునుపెన్నటికంటే ఆసక్తికరంగా మారాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు నిర్ణయాత్మకం కానున్నాయి. వాటి భవిష్యత్తుకు కీలకంగా మారనున్నాయి. ఒకవైపు కులాలు, మరోవైపు రాష్ట్ర కేంద్ర స్థాయిలోని సంక్షేమ పథకాల ఫలాలు, ఫెయిల్యూర్ పలు పార్టీల రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. రాబోయే రోజుల్లో ఆయా పార్టీల భవిష్యత్తు, ఇకపైన జరిగే పార్లమెంటు ఎన్నికల్లో విజయాన్ని ఈ రాష్ట్రంలోని ఫలితాలు ప్రభావితం చేయనున్నాయి.

బీజేపీ గ్రాఫ్ పై ప్రభావం :

2014, 2019లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ సొంతంగానే మ్యాజిక్ ఫిగర్ దాటి విజయాన్ని నమోదు చేసుకున్నది. కానీ 2024 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం కూటమిలోని అన్ని పార్టీల బలం కలిపినా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో అనివార్యంగా తెలుగుదేశం, జేడీయూ పార్టీల మద్దతుపై కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పదేండ్ల తర్వాత బీజేపీ పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయని, అందుకే ఓట్లు, సీట్ల సంఖ్య తగ్గిందని, ఇక ఆ పార్టీ పతనం ప్రారంభమైందని కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని పలు పార్టీలు వ్యాఖ్యానించాయి. ఇది బిహార్ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ ఓటమికి కారణమవుతుందన్న ధీమాను వ్యక్తం చేశాయి.

అనుకూలతపై కాంగ్రెస్ ధీమా :

దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతున్నదని, దీర్ఘకాలంగా ఆ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో సైతం 2024 పార్లమెంటు ఎన్నికల్లో సీట్లు తగ్గిపోయాయని కాంగ్రెస్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించింది. బిహార్ ఎన్నికల్లో సైతం ఇది రిపీట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నది. దీనికి తోడు జనగణనలో కులగణన చేపట్టాలని తాము గతంలో డిమాండ్ చేసినా అవహేళన చేసిన బీజేపీ.. చివరకు తలొగ్గిందని, ఇది కాంగ్రెస్ విజయమని రాహుల్ గాంధీ సహా పలువురు వ్యాఖ్యానించారు. ఇలాంటి అంశాలు ఈసారి కలిసొస్తాయని భావిస్తున్నారు.

వివాదాస్పదంగా ‘సర్’ :

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ‘ఓట్ చోర్’ అంటూ ఆటు బీజేపీని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శించింది. చివరకు సుప్రీంకోర్టులో సైతం ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 65 లక్షల మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం జాతీయ దృష్టిని, అనేక పార్టీల దృష్టిని ఆకర్షించింది. ఆధార్ కార్డును గుర్తింపు పత్రంగా పరిగణించడంపై కేంద్ర ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశాయి. ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోలేమని ఎలక్షన్ కమిషన్ వ్యాఖ్యానించింది. దీన్ని దీన్ని గుర్తింపు పత్రంగా పరిగణించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

‘సర్’ ముంచేది ఏ పార్టీని? :

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నది. ఉద్దేశపూర్వకంగానే యాంటీ బీజేపీ ఓటర్లను, ముస్లిం ఓటర్లను జాబితా నుంచి తొలగించే కుట్ర జరిగిందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో దీనిపై నిరసన తెలిపింది. న్యాయపరంగానూ ఎదుర్కొనేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అర్హత ఉన్నా జాబితా నుంచి తొలగించడంపై ఆ రాష్ట్ర ఓటర్లలో అయోమయాన్ని సృష్టించింది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారంలో ఉన్న బీజేపీకి తొత్తుగా మారిందనే తీవ్ర విమర్శలూ వెల్లువెత్తాయి. అనుకూలంగా మారాల్సిన ‘సర్’ చివరకు చేటు తెస్తుందనే భయాందోళనలూ బీజేపీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి. ‘సర్’ ప్రభావం ఏ పార్టీపై ఎలా ఉంటుందనేది కీలకం.

బలాబలాలపై అంచనాలు :

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు పార్టీలు కీలకంగా ఉన్నాయి. స్థానికంగా ఉన్న ఆర్జేడీ (రాష్ట్రీయ జనతాదళ్), జేడీయూ (జనతాదళ్ యునైటెడ్) పార్టీలతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కీలక భూమిక పోషిస్తున్నాయి. యాదవ్, ముస్లిం సెక్షన్ల ఓట్లు ఆర్జేడీకి బలమైన బ్యాంకుగా ఉన్నది. ఇక యువ నాయకుడిగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. లాలూ ప్రసాద్ యాదవ్ పై ఉన్న అవినీతి ఆరోపణలు, అనారోగ్యం.. ప్రజల్లో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. గతంకంటే ఈసారి 50కు పైగా ఎక్కువ స్థానాల్లో గెలుస్తామన్న ధీమాతో ఉన్నది. ఇక ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్.. సహజంగానే మైనారిటీ ఓట్లు అనుకూలంగా మారుతాయని, గతంకంటే సీట్లు పెరుగుతాయని భావిస్తున్నా రాష్ట్ర స్థాయిలో నాయకత్వం బలంగా లేకపోవడం వెలితిగా మారింది.

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు, అభివృద్ధి కోసం ఇస్తున్న ఆర్థిక సాయం కలిసొస్తుందని మోడీ భావిస్తున్నా స్థానికంగా బీజేపీ నేతల్లోని అసంతృప్తి, జేడీయూతో సంబంధాలు ఆందోళనకరంగా మారాయి. కుర్మి సామాజికవర్గానికి చెందిన జేడీయూ అధినేత (బిహార్ ముఖ్యమంత్రి) నితీష్ కుమార్ పరిపాలనా ఫలాలపై ఆధారపడుతున్నారు. ఇంతకాలం అమలు చేసిన రాష్ట్ర స్థాయి సంక్షేమ పథకాల ఫలాలు ఆదుకుంటాయని, మరిన్ని సీట్లలో గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

హంగ్ పైనా చర్చలు :

గతంకంటే ఎక్కువ సీట్లలో గెలిచి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అటు ఎన్డీఏ, ఇటు ఇండియా కూటమి పార్టీలు చెప్పుకుంటున్నాయి. పలు రకాల ఒపినియన్ సర్వేలు మిశ్రమ ఫలితాలు వెల్లడించాయి. మొత్తం 243 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ గా ఉన్న 122 సీట్లలో గెలుపుపై రెండు కూటములకూ అవకాశాలపై పలు సర్వే సంస్థలు అంచనాలను వెలిబుచ్చాయి. ఏ కూటమికి విజయావకాశాలు ఉన్నా మరో కూటమి నుంచి గట్టి పోటీ తప్పదనే అభిప్రాయాలూ వస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి ప్రచారం ముగింపు దశకు చేరుకున్న తర్వాత మరింత స్పష్టత రానున్నది. ఇక్కడ వెలువడే ఫలితం అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి రానున్న రోజుల్లో జాతీయ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది కానున్నది.న ఇకపైన జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపనున్నది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>