కలం, వెబ్ డెస్క్: పాక్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) విషయంలో ఆ దేశ ప్రభుత్వం ఎట్టకేలకు ఓ మెట్టు దిగింది. అవినీతి కేసులో కొన్నేళ్లుగా జైలులో ఇమ్రాన్‌ను పాక్ ప్రభుత్వం నిర్బంధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు పాక్ ప్రభుత్వం సరైన ట్రీట్మెంట్ అందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల కంటిచూపు మందగించిన విషయం బయటకొచ్చింది.
దీనిపై ఇమ్రాన్ కుటుంబసభ్యులు, పీటీఐ పార్టీ (PTI Party) నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అలాగే, ఇమ్రాన్‌కు సరైన వైద్య చికిత్స అందించాలంటూ వివిధ దేశాల క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు లేఖ రాశారు. పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఎన్నో ఏళ్లు నాయకత్వం వహించడంతోపాటు ఆ దేశానికి వరల్డ్ కప్ అందించిన తమ సహచరునికి సరైన ట్రీట్మెంట్ అందించాలని కోరారు. దీనికితోడు అంతర్జాతీయంగానూ పాక్‌పై ఒత్తిడి పెరిగింది.
ఈ క్రమంలో మంగళవారం ఇమ్రాన్ ఖాన్(Imran Khan)ను వైద్య పరీక్షల నిమిత్తం పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(పీఐఎంఎస్) ఆస్పత్రికి పాక్ ప్రభుత్వం తరలించింది. ఆయన్ను డాక్టర్లు పరిశీలించి కంటి పరీక్షలు చేశారు. ఇంజక్షన్లు ఇచ్చారు. అనంతరం ఇమ్రాన్‌ను పాక్ సైనిక దళాలు తిరిగి జైలుకు తరలించాయి. అయితే, ఇమ్రాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం గురించి మాత్రం జైలు సిబ్బంది, అధికారులు వెల్లడించలేదు.
Read Also: కేరళ స్టోరీ 2 వివాదం.. జాతీయ క్రీడాకారిణి సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

