కలం, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం నేటి యువత ప్రాణాలకు తెగించి మరీ సాహసాలు చేస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ (Kanpur)లోని ఒక బిజీ హైవేపై ఇద్దరు యువతులు చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జాతీయ రహదారిపై వాహనాలను ఏమాత్రం లెక్కచేయకుండా వారు డ్యాన్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చిత్రీకరించారు.
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అది పోలీసుల దృష్టికి చేరింది. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించడమే కాకుండా, ఇతర వాహనదారుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టారనే ఆరోపణలపై కాన్పూర్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. వైరల్ వీడియో ఆధారంగా ఆ యువతులను గుర్తించిన పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

