కలం, నిజామాబాద్ బ్యూరో : నిజామాబాద్ జిల్లా రుద్రూర్లో న్యాయవాది కల్యాణి నివాసానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి (Dinesh Patel) స్థానిక పార్టీ నాయకులతో కలిసి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కల్యాణికి ధైర్యం చెప్పి, పూర్తి న్యాయం జరిగే వరకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఇలాంటి దాడులు జరుగుతున్నా మౌనం పాటించడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. బాధితులకు న్యాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థంగా మారిందని మండిపడ్డారు. దాడికి పాల్పడిన దుండగులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో హిందువుల పైన, హిందూ దేవుళ్ల మీద దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రెండు రోజుల క్రితం ఇద్దరు బాలుర గొడవ పెద్దదిగా మారి, ఒక వర్గం వారు మరో వర్గం బాలుడిని కొడుతుంటే న్యాయవాది కల్యాణి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమెపై పరభాషలో మాట్లాడుతూ దాడికి యత్నించారు. ఈ విషయమై కల్యాణిని పరామర్శించేందుకు నిన్న ప్రయత్నించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్‌ను నిజామాబాద్‌లోనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఈరోజు పరామర్శకు వచ్చారు.
మరోవైపు న్యాయవాదులు సైతం ఆమెకు మద్దతుగా ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. దినేష్ పటేల్‌తో కలిసి సంఘీభావం తెలిపిన వారిలో స్థానిక బీజేపీ నాయకులు హరికృష్ణ, కృష్ణంరాజు, రాజు, ప్రశాంత్ గౌడ్, అనిల్, మురళి, గజేందర్ కార్యకర్తలు ఉన్నారు.

