కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ (Telangana Congress) ఆఫీసుల కోసం భూములను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయాన్ని క్యాబినెట్ (Telangana Cabinet) భేటీలో చర్చించిన తర్వాత మంత్రులు సానుకూలంగా స్పందించడంతో ఆమోదం లభించింది. జిల్లా పార్టీ ఆఫీసులకు ఎంత స్థలాన్ని కేటాయించాలనే అంశంపై త్వరలో స్పష్టత రానున్నది. రాజకీయ పార్టీలకు జిల్లాల్లో ఆఫీసులు కట్టుకోడానికి గతంలో ప్రభుత్వాలు రూపొందించిన పాలసీలు, మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అలాంటి జిల్లా కార్యాలయాలకు రెవెన్యూ శాఖ భూములను కేటాయించనున్నది. ఇందుకోసం స్థలం రేటును ఎలా ఫిక్స్ చేస్తుంది? ఎంత స్థలాన్ని సమకూరుస్తుంది? ఎన్ని జిల్లాల్లో కేటాయిస్తుంది? ఇలాంటి అంశాలపై రెవెన్యూ శాఖ త్వరలో క్లారిటీ ఇవ్వనున్నది. మంత్రులు ఈ అంశంపై మీడియా సమావేశంలో క్లారిటీ ఇవ్వనున్నారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులు…
గత ప్రభుత్వం బీఆర్ఎస్ కార్యాలయాల కోసం అన్ని జిల్లాల్లో ఎకరం చొప్పున కేటాయిస్తూ 2018లో జీవో జారీచేసింది. ఒక్కో చదరపు గజం స్థలాన్ని కేవలం వంద రూపాయలకే కేటాయించింది. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ పార్టీకి కార్యాలయం (తెలంగాణ భవన్) ఉన్నందున మిగిలిన 32 జిల్లాల్లో ఇలాంటి కేటాయింపులు జరిగాయి. ఇందులో 30 జిల్లాల్లో పార్టీ ఆఫీసుల నిర్మాణం పూర్తయింది. అన్ని జిల్లాల్లో ఒకేలా ఉండేలా పార్టీ కేంద్ర నాయకత్వం యూనిఫామ్ డిజైన్‌ను ఫిక్స్ చేసింది. హన్మకొండలో ప్రభుత్వ పార్కు స్థలాన్ని పార్టీ ఆఫీసు అవసరాలకు ఇవ్వడం వివాదాస్పదం కావడంతో మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేశారు. మరోవైపు పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలను ఇస్తూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Telangana Congress Govt) తమ పార్టీ ఆఫీసులను జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేయడం చర్చనీయాంశంగా మారింది.
Read Also: సీఎం క్యాంప్ ఆఫీస్‌కు హై సెక్యూరిటీ.. ఆ వాల్ కోసం రూ. 9 కోట్ల ప్రాజెక్టు!
Follow Us On: Sharechat


