epaper
Monday, February 23, 2026
epaper

పాక్‌పై వివక్ష చూపితే మామూలుగా ఉండదు.. ఫ్రాంచైజీలకు ఈసీబీ వార్నింగ్ !!

కలం, స్పోర్ట్స్:  క్రికెట్ ప్రపంచంలో మరోసారి భారత్-పాక్ ఉద్రిక్తతల నీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్‌లో జరగనున్న ‘ది హండ్రెడ్’ లీగ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్ల ఎంపికపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో జరగనున్న ప్లేయర్ల వేలంలో భారత ఐపీఎల్ యాజమాన్యాలకు చెందిన ఫ్రాంచైజీలు పాక్ ఆటగాళ్లను పక్కన పెట్టే అవకాశం ఉందన్న వార్తలు రావడంతో ఈసీబీ అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం అన్ని ఫ్రాంచైజీలకు ఈసీబీ ఒక అధికారిక ఈమెయిల్ పంపింది. జాతీయత ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం లేదా ఎలాంటి వివక్ష చూపడం నిబంధనలకు విరుద్ధమని బోర్డు స్పష్టం చేసింది.

ఒకవేళ ఇందుకు సంబంధించి నమ్మదగిన ఆధారాలు లభిస్తే, సంబంధిత క్రికెట్ రెగ్యులేటర్‌కు ఈ విషయాన్ని సిఫార్సు చేస్తామని హెచ్చరించింది. గవర్నింగ్ బాడీగా తాము ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటామని ఈసీబీ (ECB) వెల్లడించింది. ముఖ్యంగా మాంచెస్టర్ సూపర్ జయంట్స్, ఎంఐ లండన్, సదరన్ బ్రేవ్, సన్ రైజర్స్ లీడ్స్ వంటి జట్లు పాక్ ఆటగాళ్లను పరిగణనలోకి తీసుకోకపోవచ్చునని వార్తలు వచ్చాయి. మార్చి 11, 12 తేదీల్లో ఈ వేలం జరగనుంది. ఈ ఎడిషన్ కోసం షాహీన్ షా అఫ్రిది, షాదాబ్ ఖాన్, హారీస్ రవూఫ్, నసీమ్ షా వంటి స్టార్ ప్లేయర్లతో కలిపి మొత్తం 67 మంది పాక్ ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

గత ఏడాది వేలంలో ఒక్క పాక్ ఆటగాడిని కూడా ఫ్రాంచైజీలు కొనుగోలు చేయకపోవడం గమనార్హం. కేవలం మహమ్మద్ అమీర్, ఇమాద్ వసీంలు మాత్రమే తర్వాత రీప్లేస్‌మెంట్ ఆటగాళ్లుగా జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం ఐపీఎల్ యజమానులు దక్షిణాఫ్రికా, యూఏఈ లీగ్‌లలో కూడా జట్లను కలిగి ఉండటంతో పాక్ ఆటగాళ్లకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఈ వివాదం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్, రాజకీయ సంబంధాల మధ్య ఉన్న సంక్లిష్టతను మరోసారి తెరపైకి తెచ్చింది. వేలం రోజున ఫ్రాంచైజీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో వేచి చూడాలి.

Read Also: అల్లు శిరీష్ వివాహానికి పవన్ కల్యాణ్, నాగబాబులకు ఆహ్వానం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>