కలం, స్పోర్ట్స్: సంచలన విజయాలతో దూసుకుపోతున్న జింబాబ్వేను అడ్డుకునేందుకు వెస్టిండీస్ వ్యూహాలకు పదును పెడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం వెస్టిండీస్, జింబాబ్వే (WI vs ZIM) జట్ల మధ్య కీలక పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన విండీస్ కోచ్ డారెన్ సామీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి జట్టులోని పొడవైన ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ (Blessing Muzarabani) తమకు సవాలుగా మారే అవకాశం ఉందని ఆయన అంగీకరించారు.
ముజరబానీకి ‘ఎక్స్-ఫ్యాక్టర్’ ఉందని, అయితే అతడిని ఎదుర్కోవడానికి తమ వద్ద పక్కా ప్రణాళికలు ఉన్నాయని సామీ స్పష్టం చేశారు. కేవలం ఒక ఆటగాడినే కాకుండా జింబాబ్వేలోని ప్రతి ప్లేయర్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు సిద్ధం చేశామని తెలిపారు. గ్రూప్ దశలో శ్రీలంక, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లను ఓడించి జింబాబ్వే సూపర్-8కు చేరింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై విజయంలో ముజరబానీ 4 వికెట్లతో కీలక పాత్ర పోషించారు.
మరోవైపు, టోర్నీ ఫార్మాట్‌పై వస్తున్న విమర్శలను సామీ తోసిపుచ్చారు. గ్రూప్ విజేతలందరూ ఒకే గ్రూపులో ఉండటం వల్ల పోటీ తీవ్రంగా ఉంటుందని, అయితే అభిమానుల ప్రయాణ సౌకర్యాల దృష్ట్యా ఈ ముందస్తు షెడ్యూల్ సరైనదేనని ఆయన సమర్థించారు. జట్టు కూర్పుపై స్పందిస్తూ.. ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని సామీ సూచనప్రాయంగా తెలిపారు.
ప్రాక్టీస్‌లో షెపర్డ్ బౌలింగ్, బ్యాటింగ్ అద్భుతంగా చేశాడని, ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లందరూ పూర్తి ఫిట్నెస్తో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. తమ సైనికులందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారని, విజయం సాధిస్తామన్న ధీమాను సామీ వ్యక్తం చేశారు. రెండు జట్ల (WI vs ZIM ) మధ్య జరగబోయే ఈ సమరం క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.
Read Also: సఫారీల సక్సెస్ మంత్రా చెప్పిన కోచ్ రియాన్
Follow Us On : WhatsApp


