కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని కోఠిలో ఆశా వర్కర్ల (ASHA Workers) ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది. తమకు మూడు నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ముందు ఆశా వర్కర్లు నిరసనకు దిగారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. రూ.18 వేలు కనీసం వేతనం, ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలని, ఆశాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500 పారితోషికాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఆశా కార్యకర్తల నిరసనను అడ్డుకుంటున్నారు. వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు.
రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఈ మహిళల్లో బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే ఎక్కువ మంది ఉన్నారన్నారు. నేటికీ వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కనీసం గ్యారెంటీ ఫిక్స్డ్ వేతనం కూడా ఇప్పటి వరకు నిర్ణయించలేదని వాపోయారు. తమ సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు నిరవధిక సమ్మె చేశామని గుర్తు చేశారు.
గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని, తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిందని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిందని, ఈ రెండేళ్లలో కూడా అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు. ఇలా తమకు ఎన్నో హామీలు ఇచ్చినా నేటికి వేతనాలు పెంచలేదని, 50 లక్షల ఇన్సూరెన్స్, 50వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలేవీ అమలు చేయడం లేదని చెప్పారు. తమకు చెల్లించాల్సిన డబ్బులు పెండింగ్లో పెట్టడం వల్ల ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని వాపోయారు. వీటన్నింటినీ పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో నిధులు పెంచాలని కోరుతున్నారు.


