వరల్డ్ డ్రగ్ డాన్ మెంచో హతం.. మెక్సికోలో విధ్వంసం

కలం, వెబ్ డెస్క్: వరల్డ్ డ్రగ్ డాన్, మాఫియా లీడర్ ఎల్ మెంచో మెక్సికో సైనిక బలగాల చేతిలో హతమయ్యాడు. అమెరికా నిఘా వర్గాలు ఇచ్చిన కచ్చితమైన సమాచారంతో మెక్సికో బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించి మెంచోను మట్టుబెట్టాయి. ఈ ఘటనతో మెక్సికో అట్టుడుకుతోంది. పలు ప్రాంతాల్లో మెంచో అనుచరులు విధ్వంసం సృష్టిస్తున్నారు.

ఎవరీ ఎల్ మెంచో

ఎల్ మెంచో (60) ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ డాన్. మెక్సికోలోని మిచోకాన్ రాష్ట్రంలో జన్మించిన మెంచో తన నేర సామ్రాజ్యాన్ని ప్రపంచం మొత్తం విస్తరించాడు. 1990లలో అమెరికాలో ఓ డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో విడుదలైన అనంతరం తన కార్యకలాపాలు తీవ్ర రూపం దాల్చాయి. సీజేఎన్‌జీ అనే సంస్థను స్థాపించి మెక్సికోలోని అనేక రాష్ట్రాల్లో తన ఆధిపత్యాన్ని విస్తరించాడు. మెంచో నేతృత్వంలోని జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ (సీజేఎన్‌జీ) మెక్సికోలో ఫెంటానిల్, కోకైన్, మెథాంఫెటమైన్ వంటి మాదక ద్రవ్యాల వ్యాపారంతో పాటు ఎక్స్టార్షన్, ఫ్యూయల్ థెఫ్ట్, ఇతర క్రిమినల్ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మెంచో మీద అమెరికా ప్రభుత్వం 15 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించిందంటే అతడు ఏ స్థాయిలో ప్రభావం చూపించాడో అర్థం చేసుకోవచ్చు.

ఆపరేషన్ ఎలా జరిగింది?

జాలిస్కో రాష్ట్రంలోని టాపల్పా పట్టణంలో జరిగిన సైనిక ఆపరేషన్‌లో ఎల్ మెంచో గాయపడ్డాడు. అనంతరం మెక్సికో సిటీకి హెలికాప్టర్‌లో తరలిస్తుండగా అతను చనిపోయినట్టు భద్రతా బలగాలు చెబుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో నలుగురు సీజేఎన్‌జీ సభ్యులు హతమయ్యారు.అదుపులోకి తీసుకొని తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు మెక్సికో సైనికులు కూడా గాయపడ్డారని భద్రతా బలగాలు వెల్లడించాయి.

తీవ్రమైన హింస

ఎల్ మెంచో హతమయ్యాక సీజేఎన్‌జీ అనుచరులు రెచ్చిపోతున్నారు. తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నారు. మెక్సికోలోని అనేక ప్రాంతాల్లో తీవ్ర హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. జాలిస్కో రాజధాని గ్వాడలజారాలో రోడ్లపై వాహనాలు దహనం చేశారు. హైవేలు బ్లాక్ చేసి అల్లర్లు సృష్టిస్తున్నారు. జాలిస్కోతో పాటు కోలిమా, మిచోకాన్, నయారిట్, గ్వానాజువాటో, తమౌలిపాస్ వంటి రాష్ట్రాలకు కూడా హింస వ్యాపించింది. ఈ ఘటనల కారణంగా అనేక మంది అమెరికన్ టూరిస్టులు ఆ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు.

ప్రజలకు ప్రభుత్వం కీలక సూచనలు

మెక్సికో ప్రభుత్వం ప్రజలకు భద్రతా సూచనలు జారీ చేసింది. ముఖ్యమైన ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు ఆపేయాలని సూచించింది. విదేశీ పౌరులు, ముఖ్యంగా అమెరికన్ టూరిస్టులు, ఆపరేషన్ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. ఎల్ మెంచో మరణం సీజేఎన్‌జీ కార్యకలాపాలపై భారీ ప్రభావం చూపుతుంది. మరిన్ని హింసాత్మక సంఘటనలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>