కలం, వెబ్ డెస్క్: రాజమండ్రి (Rajahmundry) కల్తీ పాల అంశంపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఆహార భద్రత అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికులకు అస్వస్థత, మృతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలు, జరుగుతున్న విచారణపై అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చాక, కల్తీ జరిగినట్లు రుజువైతే అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే రాజమండ్రి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. మరోవైపు కల్తీ పాల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం ఇద్దరు మృతి చెందగా, సోమవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడళ్లు కూడా ఉన్నారు.


