epaper
Sunday, February 22, 2026
epaper

యాదాద్రి దర్శనం చాలా కాస్ట్‌లీ‌ గురూ.. ప్యాకేజ్‌ని బట్టి వరాలు

కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి నర్సన్న ఆలయంలో (Yadadri Temple) దర్శనం కాస్ట్‌లీగా మారిపోయింది. అక్కడి అర్చకుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. హారతి తీసుకోవాలన్నా, అర్చన చేయించాలన్నా సంభావన ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొన్నది. టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు సైతం అర్చకులకు కొంత మొత్తం ముట్టజెప్సాల్సిందే. తెలంగాణ తిరుపతిగా పేరు గాంచిన యాదాద్రిలో నిలువు దోపిడీ జరుగుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ధరల సంగతి అటుంచితే.. ఆలయంలోనూ నిలువు దోపిడీ జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. కొబ్బరికాయ కొనుగోళ్ల దగ్గరి నుంచి సెల్‌ఫోన్ డిపాజిట్.. గర్భగుడిలో అయ్యవార్లు ఇచ్చే హారతి వరకు అన్నింటికీ ముడుపులు చెల్లించాల్సిందేనని భక్తులు వాపోతున్నారు. న్యాయబద్దంగా భక్తుడికి దక్కాల్సిన దేవుడి సేవలోనూ వివక్ష రోజురోజూకీ పెరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ’ఎంతగా ముట్టజెబితే.. అంత మంచి దర్శనం దక్కుతుంది.

సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు కనీసం నాలుగు అక్షింతలు నెత్తిపైనపడే అవకాశం లేదు. పోనీ దేవుడికిచ్చిన హారతినైనా కండ్లకు అద్దుకుందామంటే.. అదీ సాధ్యపడట్లేదు. పోనీ దర్శనం కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్లే సమయంలో పెట్టే పులిహోర ప్రసాదం అందడం గగనమే.‘ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంభావన ముడితేనే ఆశీర్వాదం

ప్రధాన ఆలయంలో లక్ష్మీనర్సింహాస్వామిని దర్శించుకొని హారతి కండ్లకు అద్దుకోవాలని, నాలుగు అక్షింతలు నెత్తిపై చల్లించుకోవాలని భక్తులు ఆశపడుతుంటారు. అయితే ఆ తంతును చేయాల్సిన ఆలయ పండితులు మాత్రం.. దక్షిణ ఇస్తేనే హారతి ఇస్తున్నారంట. నాలుగు అక్షింతలు వేస్తున్నారట. దర్శనానికి వచ్చిన భక్తుల దగ్గర చిల్లర లేకపోతే అంతే సంగతి. వంద నోటు ఉన్నా.. రూ.500 నోటు ఉన్నా.. సమర్పించుకోవాల్సిందే. లేకుంటే ఆలయ పండితులు ఖరాఖండీగా హారతి ఇవ్వడం మానేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. సామాన్య భక్తులకే కాదు.. సిఫారసుల మీద వచ్చే భక్తులకు సైతం ఇదే పరిస్థితి ఎదురవుతోందట. ’వీఐపీ పాస్‌ల మీద దర్శనం విత్ అర్చన అని చిటీ రాసిస్తే.. అక్కడికి వచ్చిన భక్తులు ఎంత ఎక్కువగా దక్షిణ సమర్పిస్తేనే… అంత మంచిగా పూజ చేయడం వివాదస్పదమవుతోంది. దక్షిణ ఎక్కువగా పెట్టిన వారికి స్వామివారికి సంబంధించిన తులసీమాలతో ప్రత్యేక తంతు చేయించడం జరుగుతోంది.‘ అంటూ భక్తులు ఆరోపిస్తున్నారు.

ఆలయ పండితుల వ్యవహారంపై పెదవి విరుపు..

స్వామిదర్శనం కంటే ఆలయ (Yadadri Temple) పండితులను ప్రసన్నం చేసుకోవడం తప్పనిసరిగా మారింది. ఆలయ పండితులు ఖరాఖండీగా దక్షిణ వసూలు చేయడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఆలయంలోని గర్భగుడిలోని పండితులు ఇలా చేయడం ఏంటనే విమర్శలు లేకపోలేదు. ఓవైపు యాదాద్రి ఆలయ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఆలయ నిర్వహణలో అవకతవకలు భారీగా వెలుగులోకి వచ్చాయి. ప్రచారశాఖలో డాలర్ల మాయం, లడ్డూ తయారీ పోటులో చింతపండు మాయమైన ఘటనలు పునరావృతమవుతున్నా.. అధికారులు ఆలయ నిర్వహణను గాడిన పెట్టకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇటీవల ఐఏఎస్ స్థాయి అధికారి ఈఓగా బాధ్యతలు తీసుకున్నారు. మరీ ఇప్పటికైనా ఆలయ వ్యవస్థ గాడిన పడుతుందో.. లేదో.. వేచి చూడాల్సిందే.

Read Also: భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తమన్, రాకింగ్​ రాకేశ్​

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>