epaper
Sunday, February 22, 2026
epaper

వచ్చే రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : సీఎం రేవంత్

కలం, డెస్క్ : వచ్చే రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth) ప్రకటించారు. ములుగు జిల్లాలోని దేవాదుల ప్రాజెక్టును తాజాగా సీఎం రేవంత్ సందర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దేవాదుల ప్రాజెక్టు మొదలైనప్పుడు రూ.6500 కోట్ల అంచనా ఉండేది. దాన్ని రూ.18,500 కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో పూర్తి చేయాల్సిన వెసలుబాటు ఉన్నా.. బీఆర్ ఎస్ చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి వచ్చిన ప్రాజెక్టులు కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. బీఆర్ ఎస్ పదేళ్ల పాలనలో ప్రాణహిత, ఎస్ ఆర్ ఎస్ పి, దేవాదుల లాంటి ప్రాజెక్టులు పూర్తి చేసి 967 టీఎంసీల నీటి వాటాను వినియోగించు కుంటే బాగుండేది. వరద జలాల్లో వాటా అడిగే వాళ్లం. అప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతానికి గోదావరి నీళ్లు తీసుకు వెళ్లే అవకాశం ఉండేది. కానీ గోదావరిపైన కాళేశ్వరం తప్ప మిగిలిన ప్రాజెక్టులను పట్టించుకోలేదు. 2001లో దేవాదులకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ నిర్మాణం కొనసాగుతోంది. మేం ఇప్పుడు వాటిని సీరియస్ గా తీసుకున్నాం. రాష్ట్రంలో ఇంకా పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కచ్చితంగా రెండేళ్లలో కంప్లీట్ చేస్తాం. ఇందుకు అవసరమైన నిధులను సమకూరుస్తున్నాం. కానీ బీఆర్ ఎస్ మాత్రం ప్రాజెక్టులపై తప్పుడు ప్రచారాలు చేస్తోంది. మా మీద ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా సమస్యలు పరిష్కారం కావు’ అంటూ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

బీఆర్ ఎస్ ఎంతో గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయకున్నా దేశంలోనే అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలించిందని సీఎం రేవంత్ (Revanth) చెప్పారు. తాను ఏపీకి వాటాలకు మించి నీళ్లు తీసుకెళ్లడానికి సహకరిస్తున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని.. దాన్ని ప్రజలు నమ్మరని రేవంత్ చెప్పారు. ‘బీఆర్ ఎస్ నేతలకు నేను ఒక్కటే సూచిస్తున్నా. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో గోదావరి ప్రాజెక్టులపై ఒకరోజంతా చర్చలు జరుపుదాం. చట్టసభల్లోనే అన్నింటిపై ప్రజలకు క్లారిటీ ఇద్దాం. నా మీద చేసిన ఆరోపణలను నిరూపించాలని కోరుతున్నా. పక్క రాష్ట్రాలతో మా ప్రభుత్వానికి ఎలాంటి వివాదాలు లేవు. ప్రతి సమస్యకు చర్చలతోనే పరిష్కారం దొరుకుతుందని నేను నమ్ముతుంటాను. అందుకే పక్క రాష్ట్రాలతో ఎలాంటి సమస్యలు ఉన్నా చర్చించి పరిష్కరించుకుంటాం’ అని రేవంత్ చెప్పారు.

గోదావరి జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడుతామని.. ఇందులో ఎవరికీ ఎలాంటి అనుమానం అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గోదావరిపై కట్టిన ప్రాజెక్టులను నిరుపయోగంగా వదిలేసే ప్రసక్తి లేదన్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై నిపుణులు పరిశీలిస్తున్నారని.. కంప్లీట్ నివేదిక వచ్చిన తర్వాత మళ్లీ ఉపయోగంగా మారుస్తామని సీఎం స్పష్టం చేశారు.

అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష

అంతకు ముందు అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూన్ 2 లోపల భూసేకరణ కోసం 600 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు. బడ్జెట్ లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకోవాలన్నారు రేవంత్. మార్చి మొదటి వారంలోనే కేబినెట్ భేటీలో అంచనాలకు ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో దేవాదులపై ప్రత్యేక సమావేశం ఉంటుందని.. నెల లోపలే దేవాదుల పంప్ రిపేర్ చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టుల భూ సేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రీన్ ఛానల్ లో పరిహారం నిధులు మంజూరు చేస్తామని.. భూ సేకరణ కోసం ప్రాజెక్టులు ఆగొద్దని సీఎం స్పష్టం చేశారు. అనంతరం రామప్ప చెరువు నుంచి జంపన్న వాగుకు నీరు అందించే ప్రణాళిక పైన నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>