epaper
Sunday, February 22, 2026
epaper

నాడు కుంభకోణాలు.. నేడు అభివృద్ధి : ప్రధాని మోడీ

కలం, వెబ్​ డెస్క్​ : ఉత్తర ప్రదేశ్​లోని (Uttar Pradesh) మీరట్​ లో దేశంలోనే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ ప్రాంతీయ రైలు సర్వీస్ నమో భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో రూపొందిన ఈ ఆర్ఆర్టీఎస్ రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని స్వయంగా ఈ హైస్పీడ్ మెట్రోలో ప్రయాణించి అందులోని సౌకర్యాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మోడీ మాట్లాడారు.. కాంగ్రెస్ నాయకులు తనపై ఉన్న ద్వేషంతో తన సమాధి తవ్వాలని చూస్తున్నారని, చివరకు తన తల్లిని కూడా అవమానించడానికి వెనుకాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ గ్లోబల్ సమిట్ (AI Global Summit) వంటి జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ మర్యాదలు ఉల్లంఘించిందని ఆయన విమర్శించారు. దేశం కోసం చేసే పనులను కూడా రాజకీయం చేయడం ఆ పార్టీ అవినీతి విధానాలకు నిదర్శనమని, దీనిని దేశ ప్రజలందరూ గమనిస్తున్నారని మోడీ అన్నారు.

గత పదేళ్లలో దేశ ప్రతిష్ట ప్రపంచ దేశాల దృష్టిలో ఏ స్థాయిలో పెరిగిందో మోడీ (Narendra Modi) వివరించారు. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు భారత్ పై అచంచలమైన నమ్మకాన్ని ఉంచుతున్నాయని, అందుకే అగ్ర దేశాలన్నీ మనతో వాణిజ్య ఒప్పందాలు చేసుకునేందుకు ఆసక్తిని కనబరుస్తున్నాయని ఆయన తెలిపారు. ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు భారత్ తో ఒప్పందాలంటే వెనుకడుగు వేసేవని, కానీ నేడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మోడీ పేర్కొన్నారు.

గత ప్రభుత్వాల హయాంలో వరుసగా జరిగిన కుంభకోణాల వల్ల విదేశాలకు మన దేశంపై నమ్మకం ఉండేది కాదని ప్రధాని గుర్తు చేశారు. ఆ కాలంలో కాంగ్రెస్ నేతలు ప్రయత్నించినా అభివృద్ధి చెందిన దేశాలు భారత్ తో చేతులు కలపడానికి వెనుకాడేవని విమర్శించారు. అయితే ప్రస్తుత సుస్థిర పాలనలో ప్రపంచ దేశాలన్నీ భారత్ తో అనుసంధానమవ్వడానికి పోటీ పడుతున్నాయని చెప్పారు. 21వ శతాబ్దపు ప్రపంచ సవాళ్లకు భారత్ మాత్రమే పరిష్కారం చూపగలదనే బలమైన నమ్మకం అంతర్జాతీయ సమాజంలో నెలకొందని ప్రధాని వివరించారు.

Read Also: పాక్​ సరిహద్దులో ఇద్దరు పోలీసుల అనుమానాస్పద మృతి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>