కలం, స్పోర్ట్స్: అభిషేక్ శర్మ (Abhishek Sharma).. టీమిండియా ఆశలు పెట్టుకున్న యువ సంచలనం! కానీ, ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup) ఆయన ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. మూడు మ్యాచ్‌లు.. మూడు డకౌట్లు! దక్షిణాఫ్రికాతో జరగనున్న కీలక సూపర్-8 పోరులోనైనా ఈ యువ ఓపెనర్ తన పరుగుల ఖాతా తెరుస్తాడా? లేదా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ప్రస్తుత టోర్నీలో అమెరికా, పాకిస్థాన్, నమీబియా జట్లతో జరిగిన మ్యాచ్‌ల్లో అభిషేక్ శర్మ ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరారు. ఈ గడ్డు పరిస్థితులపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మరియు మాజీ సెలక్టర్ సబా కరీం స్పందిస్తూ పలు ఆసక్తికర విశ్లేషణలు చేశారు.
అభిషేక్ శర్మ ఆఫ్‌స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారని ఇర్ఫాన్ పఠాన్ విశ్లేషించారు. బౌలర్లు చోటు ఇవ్వకపోయినా, రూమ్ తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ బంతిని అడ్డంగా ఆడుతున్నారని, ఇదే ఆయన కొంపముంచుతోందని పఠాన్ (Irfan Pathan) పేర్కొన్నారు. ముఖ్యంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ మ్యాచ్‌ల్లో ఇదే రిపీట్ అయిందని గుర్తు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లు కూడా ఇదే వ్యూహంతో వస్తారని, అందుకే భారీ షాట్ల కంటే ముందు సింగిల్స్ తీసి ఖాతా తెరవడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. మరోవైపు, మాజీ వికెట్ కీపర్ సబా కరీం (Saba Karim) కూడా అభిషేక్ శర్మ తన బ్యాటింగ్ శైలిలో కొంత సహనం ప్రదర్శించాలని కోరారు.
మొదటి బంతి నుంచే 200 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో ఆడాలనే ఒత్తిడిని పక్కన పెట్టి, క్రీజులో కొంత సమయం గడపాలని సూచించారు. ఒకటి రెండు ఓవర్లు నిలదొక్కుకుంటే, ఆ తర్వాత సులభంగా పరుగులు రాబట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్‌క్రమ్ వంటి స్పిన్నర్ల బౌలింగ్‌లో ఆచితూచి ఆడి, ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేయాలని పఠాన్ మరియు కరీం ఇద్దరూ ఏకీభవించారు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 202 స్ట్రైక్ రేట్‌తో 176 పరుగులు చేసి అద్భుత ఫామ్‌లో ఉండగా, అభిషేక్ కూడా రాణిస్తే భారత్‌కు పవర్‌ప్లేలో తిరుగులేని ఆరంభం లభిస్తుంది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరగబోయే ఈ కీలక పోరులో అభిషేక్ శర్మ (Abhishek Sharma) తన లోపాలను అధిగమించి ఎలా రాణిస్తారో వేచి చూడాలి.
Read Also: పరుగులు కావాలంటే అభిషేక్ అలా చేయాల్సిందే: సబా కరీం
Follow Us On: Sharechat


