epaper
Sunday, February 22, 2026
epaper

మావోయిస్టు పార్టీకి భారీ షాక్​: అగ్రనేతలు లొంగుబాటు

కలం, వెబ్​ డెస్క్​ : మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది. పార్టీలో అత్యంత కీలకమైన అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ (Devji), మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న సహా మొత్తం 16 మంది తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం (SIB) ముందు లొంగిపోయారు. కానీ రాష్ట్ర పోలీసు వర్గాలు మాత్రం ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. రెండు మూడు రోజుల్లో సరెండర్ (Maoist Surrender) ప్రక్రియపై ప్రకటన వెలువడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. డీజీపీ ముందు లొంగిపోనున్నట్లు వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం.

దేవ్‌జీ (తిప్పిరి తిరుపతి) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా, పొలిట్ బ్యూరో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో అగ్రనేత మల్లా రాజిరెడ్డి (Malla Raji Reddy) పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతున్నారు. వీరిద్దరిపై ప్రభుత్వం భారీ రివార్డులను ప్రకటించింది. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలు, పార్టీలో మారుతున్న పరిణామాల వల్ల వీరు అజ్ఞాతాన్ని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కర్రెగుట్టలను అటు సీఆర్పీఎఫ్ బలగాలు, ఇటు చత్తీస్‌గఢ్ డీఆర్‌జీ (DRG) బలగాలు, తెలంగాణకు చెందిన గ్రేహౌండ్స్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అన్నివైపుల నుంచి భద్రతా బలగాలు చుట్టుముట్టడంతో లొంగిపోవడానికి (Maoist Surrender) సిద్ధమైనట్లు తెలంగాణ పోలీసు వర్గాలు తెలిపాయి.

కేంద్రం నిర్దేశించిన ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​ మార్చి 31 గడువు సమీపిస్తుండటంతో భద్రతా దళాలు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. ఇటీవల వరుస ఎన్‌కౌంటర్లు జరగడం, అగ్రనేతలు మరణించడం కీలక ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడం పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. చాలా నెలల క్రితమే బడే చొక్కారావు అలియాస్ దామోదర్ లొంగిపోనున్నట్లు వార్తలు వచ్చినా ప్రస్తుతం సరెండర్ అవుతున్న మావోయిస్టు పార్టీ నేతల జాబితాలో ఈయన పేరు లేనట్లు తెలిసింది.

గత ఏడాది కాలంలో వందలాది మంది కీలక నేతలు, కార్యకర్తలు ప్రధాన స్రవంతిలో చేరడం వల్ల పార్టీ కేడర్ బాగా తగ్గిపోయింది. ఈ ఇద్దరు అగ్రనేతలతో పాటు మరో 16 మంది కీలక సభ్యులు కూడా లొంగిపోయినట్లు సమాచారం. మరి కొద్ది సమయంలో తెలంగాణ పోలీస్ శాఖ దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లొంగుబాటుతో తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీ ఉనికి దాదాపు నామమాత్రంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: దేశంలో ఉగ్రకుట్ర భగ్నం: ముష్కరుల అరెస్ట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>